సాధారణంగా మనం ఛాయ్ తాగడానికి టీ ప్లాస్క్ ఉపయోగిస్తాం. అయితే ఈ టీ ప్లాస్క్ దేనితో తయారు చేస్తారు. సాధారణంగా ప్లాస్టిక్, స్టీల్‌తో తయారు చేస్తారు. దీనికి ఎంత ఖర్చవుతుంది. రూ.100 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. అయితే మరీ ఖరీదైనవైతే రూ.2 వేలు రూ. 3 వేల వరకు కూడా ఉంటాయి. అయితే ఈ టీ ప్లాస్క్ ధర వింటే నోరెళ్లబెడతారు. ఎందుకంటే దీని ధర ఏకంగా రూ. 24 కోట్లు. వామ్మో అనుకుంటున్నారా. దీన్ని బంగారంతో తయారు చేసి దాని చుట్టూ వజ్రాలు కూడా పొదిగించారు. ఇప్పుడు ఈ టీ పాట్ ప్రపంచ దేశాల్లోనే అత్యంత విలువైనదిగా గుర్తించారు. దీంతో ఈ టీ ప్లాస్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ అత్యంత విలువైన టీ పాట్‌ను బ్రిటన్‌లో తయారు చేశారు.
బ్రిటన్‌కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ సంస్థలు రెండు కలిసి సంయుక్తంగా ఈ టీ పాట్‌ను తయారు చేయించాయి. ఇటాలియన్ జ్యువెలరీ బిజినెస్‌మెన్ ఫుల్వియో స్కావియా ఈ టీ ప్లాస్క్‌ను ఇంత అద్భుతంగా రూపొందించారు. దీన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసి.. దాని చుట్టూ వజ్రాలను అమర్చారు. వీటితోపాటు ఆ వజ్రాల మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను కూడా ఉంచారు. మొత్తం టీ పాట్ తయారీకి 1658 వజ్రాలు, 386 ప్రామాణికమైన థాయ్, బర్మీస్ కెంపులను వినియోగించారు. అయితే ఈ అత్యంత ఖరీదైన ఈ టీ పాట్‌కు పేరు కూడా పెట్టారు. ‘ది ఇగోయిస్ట్’ అని ఈ వజ్రాలు, బంగారు టీ పాట్‌ను పిలుస్తున్నారు. అయితే దీన్ని 2016 లోనే రూపొందించారు. అప్పుడు ఈ టీ పాట్ విలువ 3 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లకు సమానం. అయితే తాజాగా ఈ టీ పాట్‌ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పాట్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ సందర్భంగా టీ పాట్ ఫొటోలను, వివరాలను ట్విట్టర్ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పాట్‌ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. ఈ టీ పాట్‌ను తయారు చేయించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఫౌండర్ బ్రిటిష్ - ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా కావడం గమనార్హం. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ టీ పాట్ డిజైన్‌ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించినట్లు తెలిపారు. స్వయంగా టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియాకు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలోని అత్యుత్తమ టీ లకు అంకితమిచ్చేలా ఒక టీ పాట్‌ను సృష్టించాలనుకుని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ ది ఇగోయిస్ట్ అనే టీ పాట్‌ను తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.