మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్‌లపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో అవినీతి అరోపణలపై నకిలీ లేఖను జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు బీజేపీ లీగల్ సెల్ కన్వినర్ నిమేశ్ పతాక్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్‌ను ప్రభుత్వం రాబడుతుందని ట్విట్టర్‌లో ప్రియాంక ఆరోపించారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు కదలడం లేదంటూ హైకోర్టు సీజేకి కాంట్రాక్టర్లు లేఖ రాశారంటూ ధ్వజమెత్తారు.
కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోనూ కమిషన్ లేనిదే పనిజగట్లేదంటూ ఆరోపించారు. ‘కర్ణాటకలోని అవినీతి బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ వసూలు చేసేది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ తన అవినీతి రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగింది.. కర్ణాటక ప్రజలు 40% కమీషన్ ప్రభుత్వాన్ని గద్దె దించారు.. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు 50% కమీషన్ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తారు’ అని ట్వీట్ చేశారు. అటు, కాంగ్రెస్ నాయకులు కమల్ నాథ్‌లు, అరుణ్ యాదవ్‌లు ఇదే విధంగా పోస్టులు చేయడంతో దుమారం రేగింది.
దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్‌లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని, ఆధారాలుంటే బయటపెట్టాలని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేరని మండిపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై సీఎం శివరాజ్ సింగ్ కూడా స్పందిస్తూ.. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు.
ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్‌లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు. అదనపు డిప్యూటీ కమిషనర్ రామసనేహి మిశ్రా మాట్లాడుతూ.. ప్రియాంక వాద్రా, కమల్ నాథ్, అరుణ్ యాదవ్‌లపై సన్యోగితగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. కేవలం 14 నెలలకే కూలిపోయింది. గ్వాలియర్ యువరాజు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.