ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భవిచ్చిత్తికి అనుమతించిన బాంబే హైకోర్టు,,,అబార్షన్ సమయంలో జన్మించిన శిశువు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 13, 2023, 08:24 PM

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మహిళ 27 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల బాంబే హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ముంబయిలోని పరేల్‌ కేఈఎం ఆస్పత్రి వైద్యులు ఆగస్టు 8న అత్యవసర అబార్షన్ నిర్వహించగా.. శిశువు సజీవంగా జన్మించింది. అయితే, ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లొద్దని తాజాగా హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. ఆగస్టు 9న జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం.. ‘వైద్య సలహా లేకుండా మహిళ, ఆ శిశువును ఆస్పత్రి నుంచి పంపొద్దు’ అని సూచించింది.


అబార్షన్ సమయంలో సజీవంగా ఉన్న శిశువు జన్మనిచ్చినట్టు వైద్యులు కోర్టుకు తెలియజేశారు. మహిళ ప్రాణాలను కాపాడేందుకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ)కి కోర్టు అనుమతించింది. దాద్రా నగర్ హవేలీలోని సిల్వాస్సాకు చెందిన 20 ఏళ్ల మహిళ గర్బం దాల్చగా.. 24 వారాల పరిమితి దాటిపోవడంతో అబార్షన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.


మార్చిలో మహిళ గర్భవతి అని తెలియగా.. అనారోగ్యంతో జులై 25 స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భం కొనసాగితే ఆమె ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు జులై 30న అంబులెన్స్‌లో సిల్వాస్సా నుంచి ముంబయిలోని కేఈఎం ఆసుపత్రికి తరలించారు. గుండెలో రంధ్రం ఏర్పడి ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో గర్భ విచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.


ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేఈఎం ఆస్పత్రి వైద్యులు.. ఆగస్టు 3న నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో అత్యవసర అబార్షన్‌ను సూచించింది. ‘గర్భం కొనసాగిస్తే మహిళ ప్రాణాలకు ప్రమాదమని.. ఆమె శారీరక, మానసిక ఆరోగ్యం.. శ్రేయస్సుకు తీవ్రమైన గాయం కలిగిస్తుంది.. ఒత్తిడికి కారణమవుతుంది’ అని పేర్కొంది. దీంతో కార్డియాలజిస్ట్‌ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని మెడికల్ టెర్మినేషన్ ముప్పు ఉన్నప్పటికీ అబార్షన్‌కు అనుమతించారు.


మహిళ, ఆమె భర్త సమ్మతితో అబార్షన్ చేయవచ్చని ఆస్పత్రి బోర్డు సిఫార్సు చేసింది. దీంతోఆ తర్వాత దంపతుల నుంచి అధికారికంగా సంతకం సమ్మతి పొందాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఆగస్ట్ 7న సమ్మతి పత్రం సమర్పించడంతో వీలైనంత త్వరగా అబార్షన్ నిర్వహించేందుకు అనుమతించారు. ఆగస్టు 8న అబార్షన్ నిర్వహించగా.. సజీవంగా ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శిశువు 484 గ్రాములు ఉండటంతో ప్రస్తుతం ఎన్ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని దంపతుల న్యాయవాది రెబెక్కా గోన్సాల్వెజ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com