స్కూళ్లకు వెళ్లే మీ పిల్లలకు డబ్బులిస్తున్నారా? పాఠశాల సమీపంలో ఉన్న షాపుల్లో చాక్లెట్లు కొని తింటున్నారా? అయితే, తల్లిదండ్రులు ఒకసారి ఈ విషయంలో ఆలోచించాల్సిందే. ఆ చాక్లెట్లలో గంజాయి ఉంటుందని మీకు తెలుసా? చాక్లెట్లలో గంజాయి ఏంటి? అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విస్తుగొలిపే ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు నగరంలో బయటపడింది. ఈ చాక్లెట్లను చిన్నారులకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మనోహర్ షెట్, బచిన్ సోంకర్ అనే ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి కిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు స్కూళ్ల దగ్గర చిన్నారులకు చాక్లెట్లు అమ్ముతున్నట్లు తేల్చారు. కాగా, ఈ చాక్లెట్లు తింటున్న విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి చాక్లెట్లకు అలవాటు అయిన పిల్లలు.. అవే కావాలని కావాలని మారాం చేస్తున్నారని, వేరేవి కొన్నా అస్సలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. రూ. 20 చాక్లెట్లే మాకు కావాలని పట్టుబడుతున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాటిని కొనాల్సి వస్తుంది. అవి తిన్న తర్వాత పిల్లలు విచిత్రంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి చూడటానికి సాధారణ చాక్లెట్లలాగే ఉంటాయి. ఇటీవలే రాయచూరులో గంజాయి కలిపిన చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 4న గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 700 గంజాయి కలిపిన చాక్లెట్లు లభ్యమయ్యాయి. నిందితులు ఈ చాక్లెట్లను పాఠశాలల సమీపంలో ఉండే దుకాణాలు, స్థానిక షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. మురికివాడలు, లేబర్ కాలనీలను లక్ష్యంగా చేసుకుని చాక్లెట్లను అమ్ముతున్నారని చెప్పారు. ఈ వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉంటూ.. తమ ఆర్ధిక పరిస్థితి కారణంగా పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. అందుకే డ్రగ్స్ ముఠాలు ఈ పిల్లల్నే తమ వ్యాపారానికి లక్ష్యంగా చేసుకున్నాయని పోలీసులు వివరించారు.