పాకిస్థాన్‌లోని చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తోన్న వాహన శ్రేణి బలూచ్ వేర్పాటువాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఏడు వాహనాల్లో 23 మంది చైనా ఇంజినీర్లు గ్వాదర్ పోర్టుకు వెళ్తుండగా ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వేర్పాటువాదులు గ్రనేడ్లు విసిరి, తుపాకులతో కాల్పులు జరిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావడంతో చైనా ఇంజినీర్లు అదృష్టవశాత్తూ చిన్న గాయాలతో బయటపడ్డారు. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి కాన్వాయ్ చేరుకోగానే రెబల్స్ కాల్పులు జరిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ప్రకటన విడుదల చేసింది.
దాదాపు రెండు గంటల పాటు తీవ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక చైనా ఇంజినీరు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజే ఈ దాడి జరగడం గమనార్హం. తాజా దాడులతో గ్వాదర్ పోర్టుకు వెళ్లే అన్ని మార్గాలను అధికారులు మూసివేశారు. ఈ ఘటనతో పాక్‌లోని చైనా రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్సుల్లోని చైనా పౌరులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైనిక ప్రజాసంబంధాల విభాగం వ్యాఖ్యలను ఉటంకిస్తూ పాకిస్థాన్ అధికారిక రేడియా ప్రకటన చేసింది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని, ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. కాగా, పాక్‌లోని చైనా పౌరులు లక్ష్యంగా దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో ఇవి పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్టుపై చైనా పెత్తనాన్ని సహించలేకపోతున్నారు. గతేడాది మేలో ఓ మహిళ కరాచీలోని విశ్వవిద్యాలయం సమీపంలో చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడి వెనుక బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉందని వెల్లడయ్యింది.
రెండేళ్ల కిందట 2021లో చైనా ఇంజినీర్లతో వెళ్తోన్న బస్సుపై ఉగ్రదాడి జరిగి.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులకు మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్‌కు పాక్ తలగ్గొంది. ఈ పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ ఘటనపై చైనా బృందాలు స్వయంగా పాకిస్థాన్‌కు వచ్చి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. అదే ఏడాది ఏప్రిల్‌లో క్వెట్టాలో ఓ విలాసవంతమైన హోటల్‌పై కూడా బాంబుదాడి చేసి చైనా దౌత్యవేత్తను చంపేశారు.