సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారికి ఏపీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. 130 మందితో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై నిరంతరం నిఘా ఉంచుతామని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నర్సాపురంలో డీజీపీ రాజేంద్రనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైబర్ నేరాలు తగ్గింపుకు ప్రతి జిల్లాలో 8 మందితో టీం ఏర్పాటు చేస్తున్నామని, నేరస్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి నేరం చేసి తప్పించుకునే ఛాన్స్ ఇవ్వమని, పటిష్టంగా కేసులు నమోదు చేస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరులో పోలీసులపై అల్లరి మూకల దాడులను డీజీపీ ఖండించారు. ఈ కేసులో ఇప్పటివరకు 80 మందిని అరెస్టు చేశామని, పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
పుంగనూరులో దాడికి పాల్పడింది స్థానికులా..? లేక బయట వ్యక్తులా..? అన్నదానిపై లోతైన విచారణ చేపడతామని డీజీపీ తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవర్ని ఉపేక్షించమని, పోలీసు వ్యవస్థ అందరికోసం పనిచేస్తుందన్నారు. రాజకీయ పార్టీలు దీనిని గుర్తించి సహకరించాలని కోరారు. అటు 1.40 లక్షల మంది మహిళలు దిశా యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, ఇప్పటివరకు 27 వేల మంది మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20 శాతం నేరాలు సంఖ్య తగ్గిందని, విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. గత ఏడాది 7500 ఎకరాల్లో సాగు ఉంటే ఇప్పుడు 1000 ఎకరాల్లోనే సాగు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో రాష్ట్రంలో గంజాయి నియంత్రణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారానికి పూర్తి స్వేచ్ఛ ఉందని, నేతల పర్యటనల విషయంలో ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఎవరిని ఎక్కడా ఇబ్బంది పెట్టవద్దని ఆదేశాలిచ్చామని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని చెబుతున్నామన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.