శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కూతురిని చూసి స్వగ్రామానికి వెళ్తున్న ఆ దంపతులను మృత్యువు వెంటాడింది. సోమవారం తెల్లవారుజామున కేతిరెడ్డి కాలనీ సమీపంలో రైలు ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం చెందాడు. ఈరోజు ఉదయం రైలు పట్టాలు దాటుతున్న రాములమ్మ, నరసింహులను రైలు ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కనగానపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటున్న కూతుర్ని చూసి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.