జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం అనకాపల్లి పరిధిలోని విసన్నపేట భూములను సందర్శించిన పవన్ ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు ఉపాది లేదని.. జాబ్ క్యాలెండర్ లేదని మండిపడ్డారు. అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వోల్టా చట్టం తుంగలోకి తొక్కారన్నారు. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని.. కేవలం ఉత్తరాంధ్ర భూములు మీదే ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ విఘాతం కలిగిందన్నారు. ఈ ఉరిలోకి రావడానికి ఇరుకు రోడ్ ఉందని.. కానీ వీరి రియల్ ఎస్టేట్‌కు మాత్రం పెద్ద రోడ్ వేసుకున్నారని మండిపడ్డారు. ‘‘మంత్రి గుడివాడ అమర్నాథ్ కాదు.. నేను సీఎంనే అడుగుతున్నాను. ఏంటీ ఈ దోపిడీ, దాష్టీకం’’ అంటూ ప్రశ్నించారు. కొండలను పిండి చేశారని.. ప్రభుత్వ భూములు, రైతులు భూములను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విసన్న పేట భూములు మీద కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.