జీరో డోర్ నంబర్లతో చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది ఓటర్లు ఉండడంపై తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం టీడీపీ భారీ నిరసనకు దిగింది. ఓటర్ వెరిఫికేషన్‌లో కూడా బీఎల్‌వోలు పాల్గొనకుండా ఉండడాన్ని నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కు, ఆర్డీఓకు లిఖితపూర్వకంగా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉండడంపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అధికారులు తీరును నిరసిస్తూ చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. టీడీపీ నిరసనను అడ్డుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తిరుపతి ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరిలో 50వేల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. బీఎన్‌వోలను పనిచేయకుండా చంద్రగిరి ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లు తొలగించడానికి ప్రత్యేక అధికారిని ఎన్నికల సంఘం నియమించాలని డిమాండ్ చేశారు. ఈనెల 21వ తేదీకి గడువు ముగుస్తుందని.. మరింత సమయం పెంచి చంద్రగిరిలో దొంగ ఓట్ల తొలగింపు ప్రక్రియని కొనసాగించాలని పట్టుబట్టారు. ఆర్డీవో కార్యాలయం ముందు రాస్తారోకోకు టీడీపీ నేతలు పూనుకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.