వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీచేస్తే తప్పకుండా ఆమె విజయం సాధిస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలు ఆమెను కోరుకుంటున్నారని, ప్రధాని మోదీ ప్రత్యర్ధిగా ఆమె పోటీ చేస్తే గెలుస్తారని రౌత్ అన్నారు. అంతేకాదు, ఈసారి అమేథీ, రాయబరేలీలోనూ బీజేపీకి ఎదురీత తప్పదని జోస్యం చెప్పారు. ‘వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీ వాద్రాను కోరుకుంటున్నారు.. ఒకవేళ ఆమె మోదీపై పోటీ చేస్తే గెలుపు ఖాయం.. రాయబరేలీ, వారణాసి, అమేథీలో ఈసారి బీజేపీకి భంగపాటు తప్పదు’ అని సంజయ్ రౌత్ అన్నారు.
ఇదే సమయంలో అజిత్ పవార్, శరద్ పవార్ భేటీపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోదీ భేటీ కాగా లేనిది.. శరద్ పవార్, అజిత్ పవార్ కలవడం తప్పేముందని ప్రశ్నించారు. ‘నవాజ్ షరీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ కలవగా లేనిది.. శరద్ పవార్, అజిత్ పవార్ ఎందుకు కలవకూడదు? ఎన్సీపీ చీఫ్‌ను అజిత్ పవార్ నిన్న కలిశారు.. దీనిపై శరద్ పవార్ త్వరలో మాట్లాడతారని మీడియా ద్వారా తెలిసింది... అజిత్ పవార్‌ని విపక్ష కూటమి ఇండియా సమావేశానికి ఆహ్వానించారని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
అంతేకాదు, ప్రస్తుత షిండే నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు డిప్యూటీ సీఎంలు అంత సంతోషంగా లేరని అన్నారు. ‘రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. ప్రస్తుత ప్రభుత్వంలో అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరు’ అని చెప్పారు. మరోవైపు, అజిత్ పవార్‌తో రహస్య భేటీ గురించి శరద్ పవార్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇందులో రహస్యం ఏముంది, ఓ వ్యక్తి ఇంట్లో భేటీ అయ్యామని బదులిచ్చారు.
‘నా కుటుంబసభ్యుడు.. నా అన్న కుమారుడితో మాట్లాడితే తప్పేముంది.. ఇది ఎవరి నివాసంలో జరిగినప్పుడు అది ఎలా రహస్య అవుతుంది... నేను అతని నివాసంలోనే కలిశాను’ అని స్పష్టం చేశారు. అంతేకాదు, తన బాగు కోరేవారు బీజేపీతో కలవాలని అంటున్నారని, అయితే ఆ పార్టీతో కలిసే ప్రసక్తేలేదని పవార్ ఉద్ఘాటించారు. తమ పార్టీ భావజాలానికి వారి సిద్ధాంతాలు సరిపోవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీని మహారాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని జోస్యం చెప్పారు.