ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను ఇటీవలే భారత్ వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. మన దేశంలో జననాల సంఖ్య పెరుగుతుండటం.. నాలుగు దశాబ్దాలుగా చైనాలో జననాల సంఖ్య తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం. చైనాలో జననాలు తగ్గుతున్నాయని ఇప్పటికే చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ 2022లో చైనాలో ఫెర్టిలిటీ రేటు మరింత పడిపోయి 1.09 శాతంగా నమోదైంది. ఓ పక్క చైనా ప్రభుత్వం పిల్లలను కనాలంటూ జనాలను బతిమాలుతోంది. పిల్లలను కనేవారికి నజరానాలను, ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటిస్తోంది. ప్రభుత్వమే కాదు ప్రయివేట్ సంస్థలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అయినా సరే పిల్లలను కనేందుకు చైనీయులు సుముఖంగా లేరు.
పిల్లల సంగతి తర్వాత.. పెళ్లి చేసుకోవడానికి కూడా చైనా యువత వెనుకడుగేస్తోంది. ఆ దేశంలో పెళ్లిళ్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. చైనా మ్యారేజ్ రేటు 2022లో 5.2 శాతమని అంచనా. గత 42 ఏళ్లలో ఇదే అత్యల్పం. 2013లో చైనాలో జరిగిన పెళ్లిళ్లతో పోలిస్తే.. 2022 నాటికి పెళ్లిళ్ల సంఖ్య సగానికి పడిపోయింది. పెళ్లి పట్ల సగటు చైనీయులు ఎంత విముఖంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
చైనా అభివృద్ధిలో దూసుకుపోతున్న కొద్దీ.. ఆ దేశ ప్రజల ఇబ్బందులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. లింగ అసమానతలు, రియల్ ఎస్టేట్ భూమ్‌తో ఇళ్ల ధరలు పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గడం లాంటి సవాళ్లతో యువత ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో డేటింగ్‌లకు, పెళ్లిళ్లకు యువత దూరంగా ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తల్లిదండ్రులు కావడానికి వారు ఆసక్తి చూపడం లేదు. దీంతో పది కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో జననాల రేటు అతి తక్కువగా ఉన్న దేశంగా చైనా నిలిచింది. ప్రపంచంలోకెల్లా అత్యల్ప జననాల రేటు నమోదవుతోన్న దేశాల జాబితాలో సౌత్ కొరియా, తైవాన్, హాంగ్ కాంగ్, సింగపూర్‌తోపాటు చైనా కూడా ఉంది.
జననాల సంఖ్య తగ్గడం, జనాభా వయసు పెరుగుతుండటం చైనాకు తలనొప్పిగా మారింది. జననాలు తగ్గడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులు ఏంటో చైనాకు బాగా తెలుసు. శ్రామిక శక్తి తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఏ దేశానికైనా మంచిది కాదు. అందుకే చైనా ప్రభుత్వం పిల్లలను కనేవారికి ఆర్థికంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.. మీ పిల్లల సంరక్షణ మా బాధ్యత అని చెబుతోంది. కానీ పెద్దగా ఫలితంగా కనిపించడం లేదు.
పిల్లలను పెంచడం, చదివించడం లాంటివి భారంగా మారుతున్నాయి. ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా మారింది. దీనికి తోడు ప్రసవం తర్వాత తమ కెరీర్ దెబ్బతింటుందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పిల్లలను కనడానికి వారు ఇష్టపడటం లేదు. పిల్లల బాధ్యత ఆడవాళ్లదే అనే భావన నుంచి ఇప్పటికీ ఆ దేశ ప్రజలు బయటపడలేదు. మగాళ్లకేమో పెటర్నిటీ లీవులు చాలా తక్కువ. ఇవన్నీ బేరిజు వేసుకొని చైనా యువత పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు.
చైనా పాలనలో ఉన్న హాంగ్ కాంగ్‌లోనూ పిల్లలు వద్దనుకుంటున్న జంటలు పెరుగుతున్నారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే హాంగ్ కాంగ్‌లో పిల్లలను లేని జంటలు రెట్టింపు అయ్యారు. పిల్లల్ని కన్నప్పటికీ చాలా మంది ఒకరు చాలనుకుంటున్నారు. 2017లో చైనాలో సగటున ఒక మహిళకు 1.3 మంది పిల్లలు ఉండగా.. గత ఏడాది అది 0.9కి తగ్గింది.
2019 నాటికే చైనాలో 25 కోట్ల మందికిపైగా 60 ఏళ్లు పైబడిన వారున్నారు. 2040 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది. అంటే అప్పటి చైనా జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 28 శాతం ఉంటారు. దీని ప్రభావం ప్రజారోగ్యంపై, ప్రభుత్వ ఖజానాపై భారీగానే ఉంటుంది. అదే సమయంలో శ్రామిక శక్తి తగ్గితే అభివృద్ధిపైనా ప్రభావం ఉంటుంది. చైనా జనాభా ఇప్పుడు దాదాపు 143 కోట్లు కాగా.. 2025 నాటికి 131 కోట్లకు తగ్గుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. 2100 నాటికి చైనా జనాభా 80 కోట్లకు పరిమితం అవుతుందని ఐరాస అంచనా వేస్తోంది.