పీకల్దాకా తాగిన ఇద్దరు పర్యాటకులు. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరుకుని ఒక రాత్రంతా అక్కడే నిద్రపోయారు. అనుమతి లేని ప్రదేశంలో టూరిస్ట్‌లు నిద్రపోయినట్టు ఉదయాన్నే భద్రతా సిబ్బంది గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆగస్టు 13 రాత్రి చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టిక్కెట్లు కొని ఈఫిల్ టవర్ ఎక్కారు. సందర్శన సమయం ముగియడంతో పర్యాటకులను భద్రతా సిబ్బంది కిందికి దింపివేశారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం భద్రతా సిబ్బందిని ఏమార్చి అనుమతి లేని ఎత్తైన రెండు మూడు లెవెల్స్ మధ్య ప్రాంతానికి చేరుకొన్నారు.
అప్పటికే తప్పతాగడంతో మద్యం మత్తుతో కిందికి దిగలేక అక్కడే రాత్రంతా హాయిగా నిద్రపోయారు. మర్నాడు ఉదయం భద్రతా సిబ్బంది గస్తీ సమయంలో అనుమతిలేని ప్రాంతంలో టూరిస్ట్‌లు నిద్రపోతున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి జాగ్రత్తగా కిందికి దింపినట్టు ఈఫిల్ టవర్ ఆపరేట్ సంస్థ సెటె పేర్కొంది.
అనంతరం వీరిని పారిస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నిర్వాకంతో సోమవారం ఉదయం గంట ఆలస్యంగా పర్యాటకులను టవర్‌పైకి అనుమతిచ్చారు. ఈఫిల్ టవర్‌ను కూల్చివేయడానికి బాంబు అమర్చామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ఈఫిల్ టవర్ కూల్చివేతకు బాంబు అమర్చినట్టు చెప్పడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
టవర్, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. సందర్శకులను బయటకు పంపారు. బాంబు స్క్యాడ్, జాగిలాలతో గాలింపు చేపట్టారు. ఎటువంటి అనుమానిత వస్తువుల లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిలు చేసిన పనిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు... ఫోన్ చేసిన ఆకతాయి గురించి ఆరా తీస్తున్నారు. ఇక, 330 మీటర్లు ఉన్న ఎత్తైన ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని 1887 జనవరిలో చేపట్టగా.. 1889లో మార్చి 31న పూర్తయింది. ఈ టవర్‌ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గతేడాది 62 లక్షలకు పైగా పర్యాటకులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.