కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రెండు రోజుల క్రితం గన్నవరంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన.. తన అనుచరులు, అభిమానులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటన చేయాలని, లేకపోతే గన్నవరం ప్రజలే తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తారంటూ వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.
ఈ క్రమంలో గన్నవరం రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ కోసం ఆయన పనిచేశారు. యార్లగడ్డ టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ చంద్రబాబుతో దాసరి బాలవర్ధనరావు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో గన్నవరం పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి.
అయితే గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ టికెట్ వంశీకే కన్ఫామ్ అయిందనే ప్రచారం బలంగా ఉంది. దీంతో వైసీపీలో యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తితో రలిగిపోతున్నారు. జగన్ అపాయింట్‌మెంట్ కోరితే ఇవ్వలేదని, లేఖ రాసినా స్పందన రాలేదని ఆవేదన చెందుతున్నారు.
వంశీ వైసీపీలోకి వచ్చే సమయంలో ఆయన రాకను యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా వంశీని వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో అప్పటినుంచి గన్నవరంలో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. యార్లగడ్డ, వంశీ వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను వంశీకే సీఎం జగన్ అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌పై హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో యార్లగడ్డ టీడీపీలో చేరనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర త్వరలో గన్నవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో గన్నవరం పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.