కర్ణాటకలో ‘అన్నభాగ్య’ పథకానికి అవసరమైన బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని రాష్ట్ర పౌర ఆహార సరఫరాల శాఖా మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు. రాష్ట్రానికి అవసరమైనంత బియ్యం సమకూర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. రవాణాతో సంబంధం లేకుండా కిలో ధర రూ.40 నిర్ణయించారని చెప్పారు. సాధారణంగా ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.34కే సమకూరుస్తోందని తెలిపారు. ఐదు కిలోల చొప్పున అదనంగా ఇవ్వదలచిన బియ్యం సమకూర్చడం సమస్య అవుతోందని, సకాలంలో బియ్యం అందకపోతే నగదు బదిలీ చేస్తామని ఆయన తెలిపారు.