ప్రభుత్వం 117 జీఓను రద్దు చేయాలని కోరుతూ ప్యాప్టో నాయకులు అనంతపురం జిల్లా, కొత్తచెరువు డీఈఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన కోడూరు శ్రీనివాసులు, కో చైర్మన సుధాకర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు అయి మూడునెలలు కాకముందే మరలా ప్రభుత్వం పని సర్దుబాటు అంటూ ఉపాధ్యాయులను బదిలీలు చేయడం సరికాదన్నారు. ప్రమోషన్లు, బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు మూడునెలలు కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు చెల్లించలేదన్నారు. ఈ పనిసర్దుబాటు వల్ల విద్యావ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కావున ఈ సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం విద్యాశాఖ ఏడీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.