ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటాను ఉద్యోగ రత్న పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు శనివారం ఆయన ఇంటికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. రతన్ టాటాకు అవార్డును అందజేశారు. ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాల్లో విశేష సేవలు అందించిన పారిశ్రామిక వేత్తలను గౌరవించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉద్యోగ రత్న అనే అవార్డును అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తొలి ఉద్యోగ రత్న అవార్డును.. 85 ఏళ్ల రతన్ టాటాకు అందించింది.
సౌత్ ముంబైలోని కొలాబాలో ఉన్న రతన్ టాటా నివాసానికి శనివారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు వెళ్లారు. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు శాలువా కప్పి.. ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందజేసి రతన్ టాటాకు సన్మానం చేశారు. రతన్ టాటా ఆరోగ్య సమస్యలతో బాధపడపడుతుండగా.. ఆయన ఇంటికే వెళ్లి ఈ ఉద్యోగరత్న అవార్డును అందించాలని నిర్ణయం తీసుకుని వెళ్లారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న’ పురస్కారం అందించడం ద్వారా ఆ అవార్డుకే మరింత గౌరవం పెరిగిందని కొనియాడారు. భారత దేశంలోని అనేక రంగాల్లో టాటా గ్రూపు సహకారం ఎంతో విలువైందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా టాటా అంటేనే నమ్మకమని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రశంసలు గుప్పించారు. ప్రపంచంలోని 6 ఖండాల్లోని 100 కు పైగా దేశాల్లో టాటా గ్రూపు ఉప్పు నుంచి ఉక్కు వరకు అన్ని రకాల బిజినెస్‌లలో తమ మార్క్‌ను చూపిస్తూ దూసుకెళ్తోందని అన్నారు. 100 కుపైగా దేశాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్.. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో 128 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.