భారీ వర్షాలకు వరదలు పోటెత్తిన ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించడం సాధారణమైన విషయమే. అదే విధంగా ఇటీవల కురుస్తున్న కుండపోత వానలకు.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనం జల దిగ్బందంలో చిక్కుకుపోయారు. ఇళ్లల్లోకి నీరు చేరి అవస్థలు పడుతూ ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారి పరిస్థితిని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఓ పాము కాటేసింది. అది గుర్తించిన అధికారులు.. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు చికిత్స అందించారు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది.
పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా ఆనంద్‌పుర్ సాహిబ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్‌జోత్ సింగ్.. తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15 వ తేదీ రాత్రి వేళ.. ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఓ విష సర్పం.. హర్‌జోత్ సింగ్‌ను కాటు వేసింది. దీంతో అది గుర్తించి.. ఆయన అధికారులకు చెప్పారు. వెంటనే ఆయనను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మంత్రికి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మంత్రి హర్‌జోత్ సింగ్.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి 2 ఫోటోలను కూడా షేర్ చేశారు. అధికారులు, సహాయక సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల్గొనగా.. ఓ పాము తనను కాటు వేసిందని పేర్కొన్నారు. విషం ప్రభావం తగ్గుతోందని.. బ్లడ్ టెస్ట్‌లో అంతా బాగానే ఉందని తేలినట్లు చెప్పారు. ప్రజలకు సాయం చేయాలనే తన సంకల్పం ముందు పాము కాటు ఏమీ చేయలేకపోయిందని.. భగవంతుడు, ప్రజల ఆశీర్వాదంతో తాను క్షేమంగా ఉన్నట్లు మంత్రి హర్‌జోత్ సింగ్ చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లాగా మారాయి. దీంతో అక్కడి నుంచి నీటిని దిగువకు వదలడంతో బియాస్, సట్లెజ్ నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పంజాబ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు వరదల ధాటికి.. పంజాబ్‌లోని రూప్‌నగర్, గురుదాస్‌పుర్, హోషియార్‌పుర్, కపుర్తలా, ఫిరోజ్‌పుర్ జిల్లాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు భారీగాా చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటనకు వెళ్లగా.. ఈ ఘటన జరిగింది.