వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే రెండు, మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలవైపు పయనిస్తుందని తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో వర్షాలకు అవకాశముంది అంటున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపారు. అంతేకాదు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవసలో 63.6 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 53.8, అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరులో 50.2, పార్వతీపురం మన్యం జిల్లా 46.8, గుంటూరు జిల్లా లాంలో 46.5, విజయనగరం జిల్లా గజపతినగరంలో 45.6, ఏలూరు జిల్లా కుక్కునూరులో 45.2, గుంటూరు జిల్లా తెనాలి 44.4, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 43, గుంటూరులో 42.4, విజయనగరం జిల్లా నెల్లిమర్లలలో 42.2, విజయనగరం జిల్లా బొందపల్లెలో 42, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 37.8, విజయనగరం జిల్లా గరివిడిలో 35.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
శుక్రవారం పల్నాడు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జులై నెలాఖరు వరకు ఏపీలో వర్షాలు కురిశాయి.. కానీ ఆగస్టులో మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. అసలు వానలే లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు మొదలయ్యాయి.
మరోవైపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు వానలు పడతాయంటున్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోసారి వర్షాలు పడతాయన్న అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రత్తమైంది. జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.
అంతేకాదు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెం.మీ, భూపాలపల్లి జిల్లా చేల్పూర్‌లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరునాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. హైదరాబాద్‌తోపాటు శివార్లలోనూ తేలికపాటి జల్లులు పడ్డాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి.