భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. దర్శనం టికెట్లు, వసతి గదుల బుకింగ్‌కు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. ఆర్జిత సేవా, కల్యాణోత్సవం, వర్చువల్ సేవా, ఆంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం, వసతి గదుల బుకింగ్ టికెట్లను ఏయే తేదీల్లో విడుదల చేస్తామనేది ఇవాళ ప్రకటించింది.
నవంబర్ నెల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ ఉదయం విడుదల చేసింది. ఆగస్ట్ 19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు భక్తులు ఆన్‌లైన్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రభాతం, తోమాల, అష్టదళపాదపద్మారాధన. అర్చన ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ ద్వారా పొందవచ్చు. పేర్లను నమోదు చేసుకున్న తర్వాత లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టికెట్లు పొందిన తర్వాత భక్తులు రుసుం చెల్లించి కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక సహస్రదీపాలంకార, ఊంజల్ సేవా, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అలాగే వర్చువల్ సేవా టికెట్లను ఆగస్టు 22న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఆంగప్రదక్షిణం టికెట్లను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుండగా.. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఇక 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు తిరుమలతో పాటు తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దర్శనం, వసతి గదుల టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తామనేది టీటీడీ ముందుగానే ప్రకటిస్తోంది. దీని వల్ల భక్తులు ముందుగానే సమాచారం తెలుసుకుని టికెట్లు విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అన్నీ టికెట్లను ఆన్‌లైన్‌లోనే టీటీడీ విడుదల చేస్తోంది.