ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న టమాట, నిన్న బనానా, నేడు యాపిల్స్.. జనం జేబులకు చిల్లు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2023, 08:56 PM

ఇటీవలి కాలంలో టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజల్లో ఎంత ఆందోళన వ్యక్తమైందో మనందరం చూశాం. ఇక చాలా మంది వంటింట్లో టమాటా మాయమైందంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలోనైతే ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు వాయించి పడేశారు. కిలో టమాటా రూ.200 పలకగా.. మరికొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు రూ.300 దగ్గరికి చేరింది. అయితే ఇటీవల అరటిపండ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ మార్కెట్లో కిలో అరటిపండ్లు రూ.100 దాటాయి. ఆ ధరలు ఇంకా పెరుగుతూనే ఉండటంతో సామాన్యులు వాటిని కొనేందుకే జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆపిల్స్ ధరలు పెరుగుతుండటం.. భవిష్యత్‌లో మరింత పెరుగుతాయన్న మార్కెట్ వర్గాల విశ్లేషణలతో జనం మరింత కలవరపాటుకు గురవుతున్నారు.


అయితే ప్రస్తుతం ఆపిల్స్ ధరలు పెరగడానికి కారణం ఉత్తర భారత దేశ రాష్ట్రాలు, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో గత 2 నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలేనని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్స్ ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ లాంటి మంచు ప్రదేశాల్లో పండిస్తారు. అయితే ఇటీవలి కుండపోత వర్షాల కారణంగా ఆ మూడు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆపిల్ పంటలు తీవ్రంగా నాశనం అయ్యాయి. ప్రకృతి బీభత్సానికి తట్టుకుని మిగిలిన కాస్త పంటను అమ్ముకోవడానికి కూడా అక్కడి రైతులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గత కొన్ని వారాల క్రితం కిలో ఆపిల్స్‌ దాదాపు రూ.120 ఉండగా.. ప్రస్తుతం కిలో ఆపిల్స్ ధర రూ.200 కి పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి.


హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆపిల్ రైతుల నుంచి హోల్‌సేల్ డీలర్లు భారీగా కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని రోడ్లు మూతపడటం, వాతావరణ పరిస్థితులు, రవాణా ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఒక్కొక్క ఆపిల్ బాక్స్‌కు రూ. 20 నుంచి రూ.25 వరకు పెరుగుతోందని కొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 25 నుంచి 26 కిలోలు ఉండే సిమ్లా ఆపిల్స్ హోల్‌సేల్ ధర రూ.2,800 ఉండేది. అయితే ఇది ప్రస్తుతం రూ.3,500 కి విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు, రాబోయేది పండగల సీజన్ కావడంతో డిమాండ్ మరింత పెరిగి ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మనాలి, జమ్ముకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆపిల్ తోటలను భారీగా పండిస్తారు. అయితే కుండపోత వర్షాలకు అక్కడి జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రోడ్లపై కొండ చరియలు విరిగిపడి రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కోసిన ఆపిల్స్‌ను కూడా రవాణా చేయడానికి వీల్లేకుండా పోయింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఆపిల్స్ ఢిల్లీకి చేరి.. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున ఆపిల్ పంట ట్రక్కులు రావడం ఆగిపోయింది.


ప్రకృతి ప్రకోపం ధాటికి అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌ సహా ఆపిల్ తోటలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రాబోయే రోజుల్లో ఆపిల్స్ ధర మరింత పెరగనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆపిల్ రవాణా చేసే ట్రక్కులకు అంతరాయాల కారణంగా ఈసారి ఆపిల్స్ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆపిల్ ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


భారీ వర్షాలు, వరదల ధాటికి ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులపై మట్టి, రాళ్లు పడి రాకపోకలు నిలిచిపోయాయి. నేషనల్ హైవేలతోపాటు, గ్రామాలకు వెళ్లే రహదారులు, చిన్న చిన్న రోడ్లు కూడా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఆపిల్ తోటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట అంతా వర్షాల పాలైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఏ కాస్త పంటనైనా అమ్ముకుని పెట్టుబడి ఖర్చులు అయినా వచ్చేలా చూసుకుందాం అనుకున్నా రాకపోకలు స్తంభించడంతో అదీ కుదరడం లేదు.


ప్రస్తుతం మార్కెట్‌లో ఆపిల్ సరఫరా తగ్గి ధరలు పెరగడంతో తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీ పరిమాణాన్ని తగ్గించి వెంటనే ఆపిల్స్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఆపిల్ రవాణా చేసేందుకు ఖర్చులు పెరుగుతాయని ఆ ప్రభావం కూడా వినియోగదారులపైనే పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోవడంతో రవాణా కష్టమవుతోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు.. రవాణా కోసం సిద్ధం చేసినవి.. ట్రక్కుల్లో లోడ్ చేసిన ఆపిల్స్ కుళ్లిపోతున్నాయని.. వాటితో మరింత నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో లోడ్ చేసిన ట్రక్కులు, టెంపోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వాపోతున్నారు.


మరోవైపు.. ఇటీవల అరటి పండ్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఇప్పటికే కిలో అరటి పండ్లు రూ.100 దాటాయి. ఇక ఓనం, గణేష్ చతుర్థి, దుర్గా పూజ వంటి పండగలు రానున్న నేపథ్యంలో అటు అరటి పండ్లతోపాటు ఆపిల్స్‌కు డిమాండ్ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరింతగా ధరలు ఎగబాకే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఇప్పటికే నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో ఇక ఆపిల్స్, అరటి పండ్ల ధరలు పెరగడం, భవిష్యత్‌లో మరింత పెరుగుతాయన్న అంచనాలతో భయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa