అబార్షన్ కేసుల్లో న్యాయస్థానాలు అనుసరించిన తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ తరహా కేసుల్లో అత్యవసర పరిస్థితితో వ్యవహరించాలని సూచించింది. సాధారణ కేసుల్లా పరిగణించి, వాయిదా వేసే ఉదాసీన వైఖరిని ప్రదర్శించకూడదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. సామూహిక అత్యాచారానికి గురై, గర్బం దాల్చిన బాధితురాలి అబార్షన్ విషయంలో గుజరాత్ హైకోర్టు వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ధర్మాసనం తప్పుపట్టింది.
26 వారాల గర్భాన్ని తొలగించాలని కోరుతూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ పెండింగులో పెట్టి ఆమెకు విలువైన సమయం వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ తరహా కేసుల్లో అత్యవసర భావనతో వ్యవహరించాలి. సాధారణ కేసుల్లా ఉదాసీన వైఖరిని ప్రదర్శించరాదు.. విచారణను పెండింగులో పెట్టడం ద్వారా విలువైన సమయం వృథా అయింది.. ఇలాంటి కేసుల్లో ఒక్క రోజు జాప్యానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది.. మేము ఇలా వ్యాఖ్యలు చేయాల్సి వస్తున్నందుకు విచారంగా ఉంది’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సామూహిక అత్యాచార బాధిత మహిళ తన 26 వారాల గర్భాన్ని తొలగింపునకు అనుమతించాలని కోరుతూ ఆగస్టు 7న గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని మర్నాడు విచారణకు స్వీకరించిన కోర్టు... వైద్య నివేదికను కోరింది. ఆగస్టు 10న నివేదిక అందజేయగా.. 11న అందినట్టు ధ్రువీకరించి ఆగస్టు 23కు కేసు వాయిదా వేసింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టు గడపతొక్కి.. తన కేసులో గుజరాత్ హైకోర్టు వ్యవహరించిన తీరును తెలియజేశారు.
ఆగస్టు 17న తమ పిటిషన్‌ను కొట్టివేసినట్టు తమ దృష్టికి వచ్చిందని.. ఇందుకు కారణాలు తెలియలేదని ఆమె తెలిపారు. అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా ఇప్పటివరకు అప్‌లోడ్ చేయలేదని మహిళ తరఫు న్యాయవాది తమ దృష్టికి తీసుకొచ్చారు.ర్మాసనం స్పందిస్తూ.. రెండు వారాలు వాయిదా వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ దర్యాప్తు చేయాలని పేర్కొంది. అనంతరం తాజాగా వైద్య నివేదికను ఆదివారం సమర్పించాలని కోరిన కోర్టు.. సోమవారం మొదటి ప్రాధాన్యతగా విచారిస్తామని తెలిపింది. ఈలోగా రాష్ట్ర తరపు న్యాయవాది అవసరమైన సూచనలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది. కాగా, జూలై 2022లో ఢిల్లీ హైకోర్టు 13 ఏళ్ల అత్యాచార బాధితురాలికి 26 వారాల గర్భవిచ్చిత్తికి అనుమతించింది. మెడికల్ బోర్డు సిఫార్సును అనుసరించి మైనర్ రేప్ బాధితురాలి 28 వారాల గర్భాన్ని రద్దు చేయడానికి కేరళ హైకోర్టు కూడా అనుమతించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa