అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేతజేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తాడిపత్రి సంజీవనగర్ కాలేజీలో జరుగుతున్న పనులను జేసీ అడ్డుకున్నారన్నారు. కాలేజీకి సమీపంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది.. కొన్నేళ్లుగా అక్కడ గ్రౌండ్‌ను రాజకీయ కార్యకలాపాలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆపేందుకు గుంతలు పూడ్చివేశారు.. 54 పిల్లర్లను జేసీ ప్రభాకర్ రెడ్డి, అనుచరులు ధ్వంసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 14 మంది టీడీపీ నేతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు.
సోమవారం కూడా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. తాడిపత్రిలో జూనియర్ కాలేజీ ప్రహరీ నిర్మాణం విషయంలో ఈ వివాదం మొదలైంది. అక్కడ ప్రహరీ నిర్మించి, గేటు ఏర్పాటు చేయటానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు సిద్ధమయ్యారు. ఈ నిర్మాణ పనులు చేసేందుకు వారు వస్తున్నారని తెలియడంతో తాడిపత్రి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టారు. అదనపు ఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి.. పోలీసులకు తగు సూచనలు చేశారు.
మొత్తం ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐ లు, భారీగా స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో 30 యాక్ట్ అమలులో ఉందని.. ఎవరూ గుంపులు, గుంపులు గా ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. అలాగే నిరసనలు ఆందోళనలు చేపట్టకూడదు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. ఈ ప్రహరీ గోడకు సంబంధించి.. మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డును.. 40 అడుగులకు కుదించి ప్రహరీ నిర్మిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ ప్రహరీ వివాదంపై అధికారులు విచారణ చేయడం లేదని.. పైగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు రోజులుగా ఈ వివాదంపై జేసీ, ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య పరస్పర ఆరోపణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడిని గెలిపించుకునేందుకు హత్య రాజకీయాలకు సిద్ధమయ్యాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వాళ్లు నోటాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని.. తనతో తన్నులు తినాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి కోరికగా ఉందన్నారు. తన అసాంఘిక కార్యకలపాలు కొనసాగించడానికే అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa