టీడీపీ బోగస్ ఓట్లని నమోదు చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఈవోను కలిసిన ఆమంచి.. పర్చూరులో టీడీపీ నేతలు చేర్చిన 40వేల బోగస్ ఓట్లను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో.. దొంగఓట్లు చేర్చిన ఏలూరు సాంబశివరావు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. 1000మంది ఉన్న జనాభా రేషియోకు సుమారుగా 600మంది ఓటర్లు ఉండాలి. 2014 ఎన్నికల సమయంలో 20,801 ఓట్లు కొత్తగా అక్రమంగా చేరాయి. ఎలక్టరోల్ టు పాపులేషన్ రేషియో గణనీయంగా 760కి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. బోగస్ ఓట్లు భారీగా పెరిగినట్టు 2014లో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ కేసును నీరుగార్చారు. 2014లో పెట్టిన ఆ కేసు ఇప్పటికే తేలలేదు. అందుకే ఇప్పుడు ఆ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఈసీని కోరాం. పర్చూరులో బాగా చదువుకున్నవారు ఎక్కువమంది ఉన్నారు. 128మంది ఎన్నారైలు 6A ద్వారా ఇక్కడ ఓటు హక్కు కొనసాగిస్తున్నారు. వాళ్ళ బంధువుల ద్వారా దొంగఓట్లు వేస్తున్నారు. కారంచేడులో పక్క ఊర్లు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు 142 ఉన్నాయి. భారతదేశంలో ఏ పౌరుడికైన ఓటు ఒక్క చోటే హక్కు ఉండాలి. పెళ్ళైన మహిళల ఓట్లను ఇంకా అక్కడే ఉంచుతున్నారు. కర్ణాటక జిల్లా రాయచూరులో స్థిరపడి అక్కడ ఓట్లు ఉన్నవారికి పర్చూరులో ఓట్లు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉంటూ పర్చూరులో బోగస్ ఓట్లు నమోదు చేసుకున్నారు అని వివరించారు.