తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకొని ఓ పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆమె చెప్పింది ఎంతో శ్రద్ధగా విన్న ఆ డాక్టర్.. తర్వాత ఆమె చేతి వేళ్లను చూపించమన్నారు. ఆమె గోళ్లను నిశితంగా పరిశీలించి.. ఆమె అనారోగ్యం వెనకున్న కారణాన్ని గుర్తించడమే కాదు.. హైదరాబాద్‌లో సంచలనంగా మారిన మహిళ మృతి కేసు మిస్టరీ ఒంటి చేత్తో చేధించారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన ఓ కుటుంబం ఆర్సెనిక్ విష ప్రభావానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. ఓ మహిళ చనిపోయింది. ఈ కేసును గుంటూరుకు చెందిన న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ రామ తారక్ నాథ్ చేధించారు. తినే ఆహారంలో ఆర్సెనిక్ కలవడం వల్లే కుటుంబ సభ్యులంతా అనారోగ్యం బారిన పడటంతోపాటు ఒకరు చనిపోయారని ఆయన గుర్తించారు. ఇంతకూ ఏమైందంటే..
మియాపూర్‌కు చెందిన సుబ్బారావు, జానకి దంపతులకు శిరీష, శేఖర్ (పేరు మార్చాం) పిల్లలు. డాక్టర్ అయిన శిరీషకు అంతకు ముందే పెళ్లి కాగా భర్తను విడిగా ఉంటోంది. 2018లో ఫార్మాసిస్ట్‌గా పని చేసే అజిత్ కుమార్‌ను ఆమె పెళ్లాడింది. అతడికి కూడా ఇది రెండో పెళ్లే. విహమయ్యాక కొన్నాళ్లపాటు ఈ దంపతులిద్దరూ సంతోషంగానే గడిపారు. కానీ తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఈలోగా అజిత్ యూకే వెళ్లిపోయాడు. కొంత కాలానికి భార్యను కూడా తన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక కూడా అతడు వేధింపులకు గురి చేయడంతో.. ఆమె బ్రిటన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు ఇచ్చేందుకు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి దంపతులిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. భార్యపై కక్ష పెంచుకున్న అజిత్.. ఆమెతోపాటు ఆమె కుటుంబాన్ని హతమార్చాలని ప్లాన్ వేశాడు.
మరోవైపు శిరీష సోదరుడు అమెరికాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది జూన్లో అతడికి ఏపీలో పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన కవిత (పేరు మార్చాం)తో వివాహం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అజిత్ తన ప్లాన్ అమలు చేయాలని భావించాడు. శిరీష తల్లిదండ్రులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఉన్న మరో బంధువును ఉపయోగించుకొని వారిని హతమొందించాలని భావించాడు. ఆ బంధువు అపార్ట్మెంట్ వాచ్‌మెన్ కొడుకు సాయంతో సుబ్బారావు ఇంట్లోని ఉప్పు డబ్బాలో ఆర్సెనిక్ పొడిని కలిపాడు. విష పదార్థమైన ఆర్సెనిక్ కలిపిన ఉప్పును వంటల్లో వాడటంతో ఆహారం తీసుకున్న వారందరికీ వాంతులు, విరేచనాలయ్యాయి. సుబ్బారావు దంపతులతోపాటు కొడుకు, కోడలు హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ జానకి ప్రాణాలు కోల్పోగా మిగతా వారు కోలుకున్నారు.
ఆ బాధ నుంచి తేరుకోక ముందే సుబ్బారావు కుటుంబంలోని ముగ్గురూ మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో నర్సరావుపేట వెళ్లిన కవిత.. గుంటూరులోని డాక్టర్ రామ తారక్ నాథ్ దగ్గరకు వెళ్లింది. రిపోర్టులన్నీ పరిశీలించి.. ఆమె చెప్పింది విన్న డాక్టర్ చేతి గోళ్లను పరిశీలించడం ద్వారా ఆమె ఆర్సెనిక్ ప్రభావానికి గురై ఉంటుందని అనుమానించారు. టెస్టులు చేయగా ఆయన అనుమానమే నిజమని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. వాచ్‌మెన్ కుమారుడిపై అనుమానం కలిగింది.
దీంతో అతణ్ని తమదైన శైలిలో ప్రశ్నించగా.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న శిరీష బంధువు గురించి చెప్పాడు. అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అజిత్ కుమార్ పేరు చెప్పాడు. ప్రస్తుతం అజిత్ పరారీలో ఉండగా.. పోలీసులు ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. ‘‘డాక్టర్ రామ తారక్ నాథ్ నా గురవు.. ఆయన దగ్గరకు వెళ్లిన పేషెంట్ గోర్లపై తెల్లని గీతలు ఉండటం చూసి ఆర్సెనిక్ ప్రభావానికి గురై ఉండొచ్చని అనుమానించారు. వీటిని మీస్ లైన్స్ అంటారని ఆయన నాకు చెప్పారు. కింగ్ ఆఫ్ పాయిజన్స్‌గా పిలిచే ఆర్సెనిక్‌తో విష ప్రయోగం జరిగితే ఈ గీతలు ఏర్పడతాయి’’ అని డాక్టర్ ముఖర్జీ మడివాడ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.