ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఆగిరిపల్లి స్థానిక శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహా స్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఈనెల 26న శోభనాచల స్వామికి పరివార దేవత లకు స్నపన, అలంకరణ, విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచన, అజస్ర దీపారాధన, మృత్సంగ్రహణము, అంకురారోపణతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. 27న వాస్తుపూజ, వాస్తు హోమం, స్వామికి నవకలశ పంచామృత స్నపన, పవిత్రములకు ప్రోక్షణ, అకల్మష హోమం, సాయంత్రం పవిత్రమల ధాన్యాధివాసం, సర్వదైవత్య శాంతిహోమం, చతుర్వేద పారాయణ జరుగనున్నాయి. 28న లక్ష్మీనరసింహా సుదర్శన మూలమంత్ర శాంతి హోమం, స్వయం వ్యక్త స్వామివారికి దిగువ సన్నిధిలోని స్వామికి, ఉపాలయమూర్తులకు పవిత్రముల సమర్పణ, నవకుంభారాధన, పారమాత్మికోపనిషత్ పూర్వక మహా శాంతి హోమం జరుగుతాయి. 29న పవిత్రముల విసర్జన, మహాపూర్ణాహుతి అనంతరం భూనీలా సమేత శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహాస్వామివార్లకు శాంతి కల్యాణం, పవిత్రముల వితరణ, నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. భక్తుల నుంచి తెలిసి తెలియక సంక్రమించే ఆచార అనాచార దోషాల నివృత్తి కోసం, లోక కల్యాణార్థం, భక్తలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని, భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొవాలని ఈవో ఎన్.భవాని కోరారు.