ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది అన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రూ. 2వేల కోట్లతో గిరిజన ప్రాంతంలోనే వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోందని.. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు కేంద్రమంత్రి. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది.. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారని.. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారన్నారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో ఈ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇప్పుడు ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందించడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నామని.. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నామన్నారు. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చామన్నారు. అలాగే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోందని.. పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోందని తెలిపారు. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోందని.. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం ఇలా బాటలు వేస్తోందన్నారు.
రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం జగన్. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశామని.. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశామని.. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్‌కే నేరుగా డబ్బుల్ని జమ చేస్తున్నామన్నారు.
గిరిజన విశ్వవిద్యాలయం కోసం దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు భూమిని ప్రభుత్వం సేకరించింది. విశాఖపట్నం–రాయగడ హైవే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. అందుకే భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించగా.. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు నిధులు కేటాయిస్తున్నారు.
గిరిజన విశ్వవిద్యాలయంలో.. పీజీలో ట్రైబల్ స్టడీస్, ఇంగ్లీష్, సోషియాలజీ, జర్నలిజం, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో బోటనీ, కెమిస్ట్రీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తున్నారు. అంతేకాదు ఈ వర్శిటీలో స్కిల్ డెవలప్‌మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa