తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల నూతన మండలి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు నూతన సభ్యుల నియామకంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పెదవి విరిచారు. టీటీడీ బోర్డును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పాత్రధారుడుగా ఉంటే, కేతన్ దేశాయ్ ఎంసీఐ స్కామ్‌లో దోషిగా నిలిచిన వ్యక్తి అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కేతన్ దేశాయ్‌ను ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తిరుమల తిరుపతి పవిత్రతను మసకబార్చే ఈ నియామకాలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తోందని ట్విటర్‌లో పురందేశ్వరి స్పష్టం చేశారు. మొత్తం 24 మంది సభ్యుల్లో ఏడుగురికి టీటీడీ బోర్డులో మళ్లీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఈనెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15 రోజులకు పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగానే... తనకు ఎన్నాళ్లుగానో వివిధ కోణాల్లో ఉపయోగపడుతున్న, ఉపయోగపడతారని భావించే వాళ్లకే పెద్దపీట వేశారు.