ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియలో అధికార పార్టీ జోక్యం పెరిగిందని.. దీంతో ప్రజలు తమ ఓటు ఉందా లేదా అని ప్రతిరోజూ తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల వారి ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు చెబుతున్నారన్నారు. మంత్రి నాగార్జున వేమూరులో ప్రభుత్వ ఆఫీస్‌లో వైసీపీ మీటింగ్ పెట్టారని.. ప్రతి మండలంలో నాలుగైదు వేల ఓట్లు తొలగించాలని మంత్రి చెప్పారని అన్నారు. మంత్రి స్థానంలో ఉన్నవారు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జెడ్పీ సీఈవో వేమూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా ఉన్నారని.. అందుకే జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో సమావేశం పెట్టినందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.