రాజమహేంద్రవరం పరిధిలోని ఆర్యాపురం అర్బన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో సుమారు 40 ఉద్యోగాలు భర్తీ చేయాలనుకున్నారు. దీనిని లాభసాటిగా మార్చుకోవాలనుకున్న నాయకులు అవినీతికి తలుపులు తెరిచేశారు. ఒక ప్రజా ప్రతినిధి పరివారంలోని కొందరు ఎవరి దారిలో వారు బేరాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులను సహకార కమిషనర్ అమరావతి పిలిపించుకున్నారు. బ్యాంకులో అవకతవకలపై గట్టిగా ప్రశ్నించి.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు ఏమిటంటూ నిలదీశారు. ఈ విషయం బయటకు రావడంతో ఉద్యోగాలకు డబ్బులు చెల్లించినవాళ్లు ఆయా నాయకులను నిలదీయడం మొదలైంది. ఈ విషయం ప్రజాప్రతినిధికి తెలియడంతో గతంలో తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని నిలదీశాడు. నేనొక్కడినే అలా చేయలేదు. వాళ్లు కూడా తీసుకున్నారంటూ ఆ డ్రైవర్ మరికొందరి గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ నాయకుడిపై ప్రజాప్రతినిధి అసహనం వ్యక్తం చేశారని సమాచారం. సదరు నాయకుడు తీవ్ర ఆగ్రహంతో కుమారుడిని తీసుకుని డ్రైవర్‌ను ఇష్టానుసారం చితక్కొట్టారని తెలిసింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.