చాలా మంది సినిమా హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. తమకు ఇష్టమైన రంగంలో ఆరితేరుతూ ఉంటారు. బిజినెస్‌లు, సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇందులో వివిధ కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉంటాడు హీరో అజిత్. బైక్ రేసింగ్‌లు అంటే ఎంతో ఇష్టమైన అజిత్.. షూటింగ్‌లు లేని సమయంలో రేసింగ్ చేస్తూ ఉంటాడు. అంతటితో ఆగకుండా టెక్నాలజీ గురించి యూనివర్సిటీల్లో పాఠాలు కూడా చెబుతాడు. ఇందులో భాగంగానే డ్రోన్ తయారీలో వారికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా భారత రక్షణ శాఖ అజిత్‌కు ఒక కీలక బాధ్యత అప్పగించింది. భారత్ - పాక్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు గస్తీ కాసేందుకు డ్రోన్లు తయారు చేసి ఇవ్వాలనే ప్రాజెక్టును ఇచ్చింది.
సినిమాల్లో కాస్త విశ్రాంతి దొరికినా బైక్ రేసింగ్‌లకు వెళ్లే హీరో అజిత్.. అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్‌ఐటీ స్టూడెంట్స్‌కు టెక్నాలజీ గురించి పాఠాలు చెబుతూ డ్రోన్లు తయారు చేస్తున్నాడు. భారత్ - పాక్ సరిహద్దుల్లో నిఘా కోసం డ్రోన్లను రూపొందించే ప్రాజెక్టును భారత రక్షణ శాఖ అజిత్‌కు అప్పగించింది. అయితే చిన్నప్పటి నుంచి విమానాల పట్ల ఆసక్తి ఉన్న అజిత్.. వాటిని నడపాలని.. వాటి గురించి ఎక్కువగా తెలుసుకునేవాడు. అయితే బైక్ మెకానిక్‌గా జీవితం ప్రారంభించి.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా విమానాలంటే ఇష్టం పోలేదు. దీంతో ఏరో స్పేస్‌కు సంబంధించి కొన్ని కోర్సులు చేశాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. ఫైటర్‌జెట్ నడిపే ట్రైనింగ్ తీసుకుని పైలట్ లైసెన్స్ కూడా సాధించాడు.
రేసర్‌గా దేశ విదేశాల్లో ఫేమస్ అయిన అజిత్.. ఆసక్తి ఉన్నవాళ్లను ప్రోత్సహించడానికి ‘ఏకే మోటో రైడింగ్’ అనే స్టార్టప్‌ను మొదలు పెట్టాడు. అందులోని రేసర్లతోపాటు అజిత్ కూడా అప్పుడప్పుడు రేసింగ్ చేస్తూ ఉంటాడు. టెక్నాలజీ, ఏరోస్పేస్ అంటే ఇష్టం ఉండే అజిత్.. 2018 లో అన్నా యూనివర్సిటీ పరిధిలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్‌ఐటీ)లోని ఏరోస్పేస్ విద్యార్థులకు క్లాసులు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. హెలికాప్టర్ టెస్ట్ పైలట్, అన్‌నేమ్‌డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్ అడ్వైజర్ పోస్టును ఎమ్ఐటీ ఇచ్చింది. దీంతో క్లాసులు చెప్పగా వచ్చిన డబ్బును పేద విద్యార్థులకు ఇచ్చేవాడు. విదేశాల్లో షూటింగులు ఉన్నపుడు అక్కడ ఉండే యూనివర్సిటీలకు వెళ్లి ఏరోస్పేస్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుని ఆన్‌లైన్‌లో ఎమ్ఐటీ విద్యార్థులకు క్లాసులు చెబుతాడు.
ఎమ్‌ఐటీలో ఏరోస్పేస్ రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ గ్రూప్ పేరు దక్ష. వారితో కలిసి అజిత్ డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్‌ను తయారు చేశాడు. అధిక బరువును అతి తక్కువ సమయంలో టార్గెట్‌కు చేర్చేలా ఈ డ్రోన్‌లను రూపొందించారు. ఇవి ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పోటీలో రెండో స్థానంలో నిలిచాయి. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు బ్లడ్, మెడిసిన్ అందజేసిన ఆ డ్రోన్‌కు 2019 లో భారత డ్రోన్ ఒలింపిక్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అందించే అబ్దుల్ కలాం అవార్డును అజిత్‌కు అందించింది.
అజిత్ తయారు చేసిన డ్రోన్లు కొవిడ్ సమయంలో తమిళనాడులో ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్‌వేర్ ఆధారంగా పెట్రోల్‌తో నడిచే డ్రోన్ అరగంటలో ఎకరం విస్తీర్ణంలో రసాయనాలను చల్లుతుంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ డ్రోన్ల సాయంతో కరోనా సమయంలో రసాయనాలు చల్లేందుకు ఉపయోగించింది. దీంతో ఈ దక్ష టీమ్ తయారు చేసిన డ్రోన్ల గురించి తెలుసుకున్న భారత రక్షణ శాఖ.. సరిహద్దుల్లో నిఘా డ్రోన్ల కోసం అజిత్‌ను సంప్రదించింది. ఏడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసే ఈ కాంట్రాక్టును అజిత్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు రూ.170 కోట్లు. ఈ దక్ష టీమ్ రూపొందించిన డ్రోన్లను భారత్- పాక్ సరిహద్దుల్లో నిఘాకోసం, విపత్తుల్లో సహాయక కార్యక్రమాల కోసం భారత రక్షణ శాఖ వినియోగించనుంది.