కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించిన ప్రభుత్వ కాలేజీ లెక్చరర్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ విషయం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించింది. ఆయన్ను విధుల నుంచి ఎందుకు తొలగించారని? కోర్టులో వాదనలు వినిపిస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన ఎందుకు పక్కనబెట్టారో తెలుసుకోవాలంటూ అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ విద్యా విభాగానికి చెందిన లెక్చరర్ హూర్ అహ్మద్ భట్ కూడా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆగస్టు 24 నాటి విచారణకు ఆయన కూడా హాజరయ్యారు. లా డిగ్రీ పూర్తిచేసి పట్టా కలిగిన భట్.. తన పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించారు. అయితే, ఆ మర్నాడే భట్ అనూహ్యంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఆగస్టు 25న జమ్మూ కశ్మీర్ విద్యా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జమ్మూ కశ్మీర్ సివిల్ సర్వీస్ నిబంధనలు, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల నియామావళిని, రాష్ట్ర ప్రభుత్వ సెలవు నియమావళిని ఉల్లంఘించిన కారణంగా సస్పెండ్ చేసినట్టు తెలిపింది.
దీంతో సోమవారం నాటి విచారణ సందర్భంగా.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘‘లెక్చరర్ అహ్మద్ భట్ రెండు రోజులు సెలవు తీసుకుని విచారణకు వచ్చి వాదనలు వినిపించారు. తిరిగి వెళ్లగానే ఆయన సస్పెండ్ అయ్యారు’’ అని ధర్మాసనానికి సిబల్ తెలిపారు. ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవాలని ఏజీ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఆదేశించింది.
‘‘మిస్టర్ అటార్నీ జనరల్.. ఈ కోర్టు ముందు వాదనలు వినిపించిన వ్యక్తిని సస్పెండ్ చేశారా? ఇలా జరగడమేంటి... దీనిపై వెంటనే జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడండి. పూర్తి వివరాలు సమర్పించండి’ అని ఏజీ, ఎస్‌జీలకు కోర్టు స్పష్టం చేసింది. దీనికి ఎస్‌జీ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘లెక్చరర్ సస్పెన్షన్ వెనుక పలు కారణాలు ఉన్నాయని తెలిసింది. ఆయన తరచూ విభిన్న కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఆ వివరాలన్నీ కోర్టుకు సమర్పిస్తాం’ అని తెలిపారు. ‘మరేదైనా కారణం ఉంటే సస్పెండ్ చేయడం ఎందుకు?.. ఖచ్చితంగా ఇదిసరైనది కాదు’ అని ఈ సందర్భంగా ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. మరో న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యగా అనిపిస్తోందన్నారు. ‘న్యాయస్థానానికి వచ్చారని అలా జరిగితే అది ప్రతీకార చర్యే.. ఇలాంటి చర్యలకు పాల్పడితే స్వేచ్ఛ ఏమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.