ఏపీలో పెన్ డౌన్ కు డాక్యుమెంట్ రైటర్లు సిద్ధమవుతున్నారు. ఇదిలావుంటే ఏపీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సాఫ్ట్ వేర్ తీసుకువస్తోంది. దీని పేరు కార్డ్ 2.0. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (కార్డ్) సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి కార్డ్ ప్రైమ్ సాఫ్ట్ వేర్ 2.0 వెర్షన్ తీసుకువచ్చారు. దీని సాయంతో డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. స్టాంపు పేపర్లు, వాటిపై సంతకాలతో పని ఉండదు. ప్రజలే సొంతంగా ఆన్ లైన్ లో తమకు అవసరమైన డాక్యుమెంట్ తయారు చేసుకునే సదుపాయాన్ని ఈ సాఫ్ట్ వేర్ కల్పిస్తుంది.
ఆన్ లైన్ లో స్టాంపు ఫీజు, రిజిస్ట్రేషన్ చలానా కట్టేసి, ఒక టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆపై, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గానీ, గ్రామ/వార్డు సచివాలయానికి గానీ వెళితే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. దీనిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ స్పందించారు. ఆగస్టు 31 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్ వేర్ తో కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు. సెప్టెంబరు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ ప్రత్యేక సాఫ్ట్ వేర్ అమల్లోకి తెస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రజల సమయం ఎంతో ఆదా అవుతుందని తెలిపారు.
వినియోగదారులు డిజిటల్ సైన్ సాయంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, కోరుకున్న డాక్యుమెంట్ ను ప్రక్రియ అనంతరం నేరుగా ఈమెయిల్ కు పంపిస్తామని ఐజీ వివరించారు.
ఈ కార్డ్ ప్రైమ్ 2.0 సాఫ్ట్ వేర్ రాకతో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ముప్పు కలిగే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సాఫ్ట్ వేర్ వద్దని డాక్యుమెంట్ రైటర్లు అంటున్నారు. ఈ మేరకు పెన్ డౌన్ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ నెల 30, 31 తేదీల్లో నిరసన చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు నిర్ణయం తీసుకున్నారు.