కేరళ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఊమెన్ చాందీ చిన్న కూతురు అచ్చు ఊమెన్ సైబర్ దాడికి సంబంధించి పోలీసులను ఆశ్రయించారు. తిరువనంతపురంకు చెందిన ఓ వ్యక్తి తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టులు పెడుతున్నారని, తనను, తన తండ్రిని అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఫ్యాషన్, ట్రావెల్ సెక్టార్‌లో కంటెంట్ క్రియేటర్‌గా పని చేస్తున్నానని, తన ఉద్యోగంలో భాగంగా తీసిన ఫోటోగ్రాఫ్స్‌ను సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌పై పోస్ట్ చేసి, తన తండ్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఊమెన్ చాందీ గత నెలలో మరణించడంతో సెప్టెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తమపై చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. రాష్ట్రంలో అవినీతి, ద్రవ్యోల్బణం నుంచి దృష్టి మరల్చేందుకు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.