తిరుమలకు కాలిబాటలో వచ్చే భక్తులకు.. అలిపిరి నుంచి తిరుమల వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు కల్పించారనే అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తిరుమల కాలిబాటలో భక్తులపై చిరుతల దాడికి సంబంధించి బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షితా కుటుంబానికి రూ. 15 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చామని టీటీడీ తరఫు న్యాయవాది చెప్పారు. క్రూరంగా జరిగిన చిరుత దాడిలో మరణించిన లాక్షితా కుటుంబానికి రూ. 15 లక్షలు చాలవని, సహాయం పెంచాలని న్యాయస్థానం ఆదేశించింది. భక్తులకు రక్షణ కల్పించాల్సిన టీటీడీ కర్రలు ఇవ్వడం ఏంటని న్యాయవాది యాలమంజుల బాలాజీ వాదించారు. వన్య ప్రాణుల కదలికలకు అవసరమైతే అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. భక్తుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.