ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అప్యాయతకు నిదర్శనం ఈ పండుగ,,, చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 10:05 PM

అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అప్యాయతకు నిదర్శనం ఈ  రక్షా బంధన్ వేడుక అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు రక్షా బంధన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌’కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు.. మహాశక్తి కవచాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఈ పండగ అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అప్యాయతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇంత మంది మధ్య రాఖీ పండుగ జరుపుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైనది...ఉన్నతమైనది. పిల్లల కోసమే బ్రతికే ప్రజలు మన భారతీయులు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి..వారి భవిష్యత్ గురించే ఆలోచిస్తారు. పిల్లల చదువులు, వారి అవసరాల కోసమే తల్లులు తపిస్తారు. తల్లులు తాము భోజనం చేయకపోయినా పిల్లలకు ముందు పెట్టాలి అని భావిస్తారు. అందుకే నేడు అమెరికాలో కూడా మన సంస్కృతిని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు.’’ 


 ‘‘తెలుగుదేశం ఇచ్చిన మహాశక్తి అనేది దూరదృష్టితో తెచ్చిన కార్యక్రమం. భవిష్యత్ అవసరాలను గుర్తించి కార్యక్రమాలు తెచ్చే పార్టీ తెలుగుదేశం. 1986లోనే ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ చట్టం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఆడపిల్ల పుడితే బాలికా సంరక్షణ పథకం కింద నాడు పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేశాం. దీంతో ఆడపిల్లలకు ఎంతో మేలు జరిగింది. రాజకీయాల్లో మహిళల పాత్ర ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం టీడీపీ పోరాడుతుంది. నిలబడుతుంది. మహిళలు మగవారితో సమానంగా పోటీ పడే పరిస్థితి రావాలి. ఆడబిడ్డలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. దీంతో మహిళలు ఎంతో లబ్ధి పొందారు. దీని వల్ల మహిళలు సంపాదించారు....వరకట్నం అనే సమస్య పోయింది. ఒక ప్రభుత్వ పాలసీ ద్వారా ఆడబిడ్డల జీవితాలు మార్చాం.. అదీ తెలుగు దేశం ముందుచూపు!’’


‘‘ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధానం తీసుకువచ్చింది టీడీపీ. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం డ్వాక్రా సంఘాలు పెట్టాం. భర్త, తండ్రి, పిల్లలపై మహళలు ఆధారపడకుండా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల జీవితాలు మార్చాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే బడికి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చాం. అబ్బాయిలకు పోటీగా మేమే నిలబడతాం అని పిల్లలు చదువుకోవాలని వారికి సైకిళ్లు ఇచ్చాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించిన పార్టీ టీడీపీ. మహిళలు వంట ఇబ్బందులు పడుతుంటే...అవి చూసి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చాం. మహిళల కోసం 10 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశాం. సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ. ఒక అన్నగా నాడు శ్రీమంతాలు పెట్టాం. పెళ్లి కానుక ఆడబిడ్డకు అందించాం.’’


  ‘‘తల్లికి వందనం అని పిల్లలతో తల్లి కాళ్లు కడిగించాం. మన సంస్కృతి సంప్రదాయాల కోసం ఇవన్నీ చేశాం. ఇవన్నీ ఎవరో చెబితే....చెయ్యలేదు. మీరు పైకి రావాలి అని చేశాను. ఇప్పుడు మళ్లీ మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించాను. మహాశక్తి పథకంలో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ. 15 వేలు ఇస్తాం. పిల్లల భవిష్యత్, జనాభా నిర్వహణ కోసం ఈ పథకం రూపకల్పన చేశాను. భూమి, డబ్బు కాదు...మనిషి అనేవాళ్లు ఆస్తిగా ఉండాలి. అదే నా ఆలోచన. ఆడబిడ్డ నిధి కింద ఒక్కో మహిళకు రూ.1500 నెలకు ఇస్తాం.’’


 ‘‘పి 4 విధానంతో పేదల జీవితాలు మార్చవచ్చు. నాడు పి3 విధానంతో అనేక మార్పులు వచ్చాయి. అప్పుడు ఆ స్ఫూర్తితోనే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టనర్ షిప్ విధానం ప్రకటించాం. దీంతో పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావచ్చు. ముందు పేదరికం నుంచి ఆ వర్గాలను బయటకు తీసుకువస్తాను. మహిళలకు ఇంటి నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించాను. అవసరం అయితే ఇంకో సిలిండర్ అదనంగా ఉచితంగా ఇద్దాం. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చాం.’’ 


‘‘ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే...నేను ఆత్మస్థైర్యం ఇచ్చాను. దీనితోనే మహిళలు అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంది. గట్టి సంకల్పంతో అనుకుంటే ఏదైనా అయిపోతుంది. తెలుగు దేశం గెలవాలని గట్టి సంకల్పం చేయిండి. మీ మహిళల జీవితాలు మార్చే బాధ్యత నాది. జగన్ అసమర్థత వల్ల ఆయన సొంత నియోజకవర్గంలో 5 వేల ఎకరాల పంటలు ఎండిపోయాయి. అందుకే అంటున్నా మనది ముందు చూపు...జగన్ ది దొంగ చూపు అని. తెలుగు ఆడబిడ్డలను శక్తివంతమైన మహిళలుగా మార్చడమే నా లక్ష్యం మీ ఆశీర్వాదం ఇవ్వండి’’ అని కోరారు. ప్రజలకు మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ప్రసంగం ముగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com