ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని నందమూరి కుటుంబ సభ్యులు అవమానించారని ఆయన అన్నారు. బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ... లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని, నాడు ఎన్నికల్లో కూడా తన పక్కన ప్రచారంలో నిలబెట్టుకున్నారని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెను ఆమోదించారన్నారు. కానీ చంద్రబాబు, పురందేశ్వరి ముఠా మాత్రం లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్‌కు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వారిది రాక్షసత్వమని దుయ్యబట్టారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఇన్నాళ్లయినప్పటికీ చంద్రబాబు చెప్పినట్లు పురందేశ్వరి సహా వారి కుటుంబం నడవడం విడ్డూరమన్నారు. మరోవైపు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మరోసారి వెన్నుపోటు పొడిచారని, అవమానించారన్నారు. ఎన్టీఆర్‌ను తనకు అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ నాణెం పేరిట లక్ష్మీపార్వతిని పిలవకపోవడం ఆయన ఆత్మకు క్షోభ అన్నారు. దీంతో చంద్రబాబు రెండు వెన్నుపోట్లు పొడిచినట్లయిందన్నారు.
పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌లా మారిపోయారన్నారు. వారిది రాజకీయం తప్ప మరేమీ లేదని, అందుకు ఎన్టీఆర్‌ను ఉపయోగించుకుంటున్నారన్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.