కోడికత్తితో దాడి ఘటనపై లాయర్ సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై దాడి చేశాడంటూ కేసు నమోదయింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ కు కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని సలీం ఆరోపించారు. దినేశ్ కుమార్ కు మజ్జి శ్రీనివాసరావు కోడికత్తిని ఇచ్చాడని, అయితే ఆ నేరాన్ని శ్రీనుపై మోపారని చెప్పారు. కావాలనే ఎన్ఐఏ కోర్టు విచారణకు జగన్ హాజరు కావడం లేదని... విచారణకు జగన్ హాజరైతే అన్ని వివరాలు బయటపడుతాయని అన్నారు. కోడికత్తి దాడిలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ గతంలోనే చెప్పిందని సలీం తెలిపారు. రాజకీయాల కోసమే ఈ కేసును సాగదీస్తున్నారని చెప్పారు. మరోవైపు జగన్ కోర్టుకు వచ్చి, ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాలని దళిత సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. అయితే నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే దళిత సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.