పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. తమ వాహనానికి జరిమానా వేశారనే కోపంతో పోలీస్ హెల్ప్ డెస్క్ కేంద్రానికే కరెంట్ కట్ చేశారు విద్యుత్ సిబ్బంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖకు చెందిన కొంత మంది ఉద్యోగులు బైక్ మీద వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినట్లు గుర్తించి, ఫోటోలు తీసి.. వారి వాహనానికి ఫైన్ విధించారు. ఈ ఘటన వారికి ఆగ్రహం తెప్పించింది. తాము విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలో జిల్లా కేంద్రంలోని ఓ కూడలి వద్ద ఉన్న పోలీస్ హెల్ప్ డెస్క్ వద్దకు ఇద్దరు విద్యుత్ సిబ్బంది వచ్చారు. వారిలో ఒకరు చూస్తుండగానే పోల్ ఎక్కి.. హెల్ప్ డెస్క్‌కు వెళ్లే కరెంట్ వైర్ కట్ చేశాడు. కరెంట్ వైర్ ఎందుకు కట్ చేశారని పోలీసులు ప్రశ్నిస్తుండగానే.. వారిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వాహనానికి చలానా విధించామనే విద్యుత్ లైన్ కట్ చేశారానని పోలీసులు నిలదీయగా.. సరైన సమాధానం చెప్పలేదు. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. (ట్రాఫిక్ పోలీసులు, కరెంట్ సిబ్బంది మధ్య వాగ్వాదాన్ని వీడియోలో చూడవచ్చు).
ఈ ఉదంతాన్ని గమనించి కొంత మంది మీడియా ప్రతినిధులు పోలీస్ హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చారు. ఏమైందని ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. గొడవ పెద్దదవుతుందని భావించిన విద్యుత్ సిబ్బంది.. కాసేపటి తర్వాత వచ్చి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే, పోలీస్ హెల్ప్ డెస్క్‌కు విద్యుత్ సరఫరా నిబంధనల ప్రకారమే ఉందా? లేదా? ఒకవేళ నిబంధనల ప్రకారమే ఉన్నా.. విద్యుత్ సరఫరా కట్ చేశారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం మాత్రం చర్చనీయాంశంగా మారింది.