వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ముందుగానే సిద్ధమవుతోంది.. ఇప్పటికే మహానాడులో మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. అయితే తాజాగా చంద్రబాబు మరో కీలక హామీ ఇచ్చారు. మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన మూడు వంట గ్యాస్ సిలిండర్లతో పాటు అవసరమైతే అదనంగా మరో సిలిండర్‌ను అందిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళల సంక్షేమం కోసం మహాశక్తి పేరుతో ప్రకటించిన పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆడబిడ్డలు అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతారన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మకుమారీలు, తెలుగు మహిళలు చంద్రబాబుకు రాఖీ కట్టారు. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా మహాశక్తి కవచం పేరుతో రూపొందించిన బ్యాండ్‌ను ఆయన ఆవిష్కరించారు.
పిల్లల చదువులు, వారి అవసరాల కోసమే తల్లులు తపిస్తారన్నారు చంద్రబాబు. తల్లి భోజనం చేయకపోయినా.. పిల్లలకు ముందు పెట్టాలి అని భావిస్తారన్నారు. తెలుగుదేశం ఇచ్చిన మహాశక్తి అనేది దూరదృష్టితో ఇచ్చిన కార్యక్రమమని.. భవిష్యత్ అవసరాలను గుర్తించి కార్యక్రమాలు తెచ్చే పార్టీ తెలుగుదేశం అన్నారు. 1986లోనే ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ చట్టం చేశారని.. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ టీడీపీ హయాంలోనే ప్రారంభమైందన్నారు. ఆడపిల్ల పుడితే బాలికా సంరక్షణ పధకం కింద నాడు పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేశామని.. దీంతో ఆడపిల్లలకు ఎంతో మేలు జరిగింది అన్నారు. రాజకీయాల్లో మహిళల పాత్ర ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని.. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం టీడీపీ పోరాడుతుంది అన్నారు.
మహిళ మగవారితో సమానంగా పోటీ పడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాం. దీంతో మహిళలు ఎంతో లబ్ది పొందారన్నారు. దీని వల్ల మహిళలు సంపాదించారు.. వరకట్నం అనే సమస్య పోయింది అన్నారు. ఒక ప్రభుత్వ పాలసీ ద్వారా ఆడబిడ్డల జీవితాలు మార్చామని.. అదీ తెలుగు దేశం ముందుచూపు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధానం తీసుకువచ్చింది టీడీపీ.. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామన్నారు. భర్త, తండ్రి, పిల్లలపై మహళలు ఆధారపడకుండా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల జీవితాలు మార్చామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే బడికి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చామన్నారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించిన పార్టీ టీడీపీ అన్నారు. మహిళలు వంట ఇబ్బందులు పడుతుంటే...అవి చూసి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చామన్నారు. మహిళల కోసం 10 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశామని. సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ అన్నారు. పెళ్లి కానుక ఆడబిడ్డకు అందించామని.. తల్లికి వందనం అని పిల్లలతో తల్లి కాళ్లు కడిగించామన్నారు. మన సంస్కృతి సంప్రదాయాల కోసం ఇవన్నీ చేశామన్నారు. ఇవన్నీ ఎవరో చెబితే చెయ్యలేదన్నారు.. మహిళలు పైకి రావాలి అని చేశాను అన్నారు. ఇప్పుడు మళ్లీ మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించామన్నారు.
ముందు పేదరికం నుంచి ఆ వర్గాలను బయటకు తీసుకువస్తాను అన్నారు. మహిళలకు ఇంటి నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని ప్రకటించాను. అవసరం అయితే ఇంకో సిలిండర్ అదనంగా ఉచితంగా ఇద్దామన్నారు. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చానన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే.. తాను ఆత్మస్థైర్యం ఇచ్చానన్నారు. దీంతో మహిళలు అద్బుతాలు సృష్టించే అవకాశం ఉందని.. గట్టి సంకల్పంతో అనుకుంటే ఏదైనా అయిపోతుందన్నారు. తెలుగు దేశం గెలవాలి అని గట్టి సంకల్పం చేయాలని.. మహిళల జీవితాలు మార్చే బాధ్యత తనదన్నారు.