శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 18న స్వామి వారికి పట్టువస్త్రాలను సీఎం జగన్ సమర్పిస్తారని తెలిపారు. గరుడ సేవ రోజున రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు.
భక్తులకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు రుయా ఆసుపత్రి నుంచి సిబ్బందిని రప్పిస్తామని చెప్పారు. ఘాట్ రోడ్డులో 24 గంటలపాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలిపారు. క్రూర మృగాల సంచారం నేపథ్యంలో నడకదారులు, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటవీ శాఖ ఇచ్చే నివేదిక మేరకు నడక మార్గంలో నిబంధనలను సడలిస్తామని వివరించారు.