టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఇదిాలావుంటే నారా లోకేశ్ పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200వ రోజు యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా... లోకేశ్ కు సంఘీభావంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. అన్న లోకేశ్ తో కలిసి సినీ నటుడు నారా రోహిత్ నడిచారు. 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెం లో గిరిజనులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొననున్నారు. వారి సమస్యలు తెలుసుకుని వారికి భరోసాను ఇవ్వనున్నారు.
మరోవైపు, పాదయాత్ర 200వ రోజున 2,700 కిలోమీటర్లకు చేరుకున్న నేపథ్యంలో పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో పాలనపై సమరభేరి మోగిస్తూ, ప్రజాచైతన్యమే లక్ష్యంగా తాను ప్రారంభించిన పాదయాత్ర సీతంపేట వద్ద 2,700 కిలోమీటర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. వివిధ వర్గాలపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులను టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీ ఇచ్చారు. దీని వల్ల జగనాసురుడి పాలనలో బాధితులైన ప్రజలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. మరోవైపు రాఖీ బంధన్ సందర్భంగా లోకేశ్ కు మహిళలు రాఖీలు కట్టారు. లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు.