రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ రంగు పులిమారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని, వాటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ‘‘రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబం అంతా వెళ్లి హాజరయ్యాం. దీన్ని తప్పుపడతారా? ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ రంగు పులిమారు” అని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. మరోవైపు పేదల కోసం కేంద్రం గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే దాన్నీ రాజకీయం అనడం సరికాదని పురందేశ్వరి అన్నారు. ఏపీలోని హిందూ దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో అన్య మతస్తులను నియమిస్తున్నారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము దేవాలయాల వద్ద సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని చెప్పారు.