రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఏం చేసినా అది చాలా ప్రభావం ఉంటుంది. అందుకే వారు ఏది చేసినా వార్తల్లో నిలుస్తుంది. ఇలాగే తాజాగా ఓ రాజకీయ నేత చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎందుకంటే మొదటి పెళ్లి రోజు సందర్భంగా సదరు నేత.. తన భార్యకు ఏకే 47 తుపాకీ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ ఫోటోను కాస్త సోషల్ మీడియాలో ఉంచడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ ఫోటో వైరల్‌గా మారడంతో నెటిజన్లతోపాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు అతనికి ఏకే 47 తుపాకీ ఎలా వచ్చింది అనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
తన భార్యకు మొదటి వెడ్డింగ్ యానివర్సరీకి ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత రైజల్ హాక్ వివాదంలో చిక్కుకున్నారు. మొదటి పెళ్లి రోజు సందర్భంగా తన భార్య సబీనా యాస్మిన్‌కు ఏకే 47 తుపాకీని ఇచ్చాడు.
అయితే ఆ విషయాన్ని అక్కడితే వదిలేయకుండా తన భార్య ఏకే 47 తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లతోపాటు మీడియాలో విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
పెళ్లి రోజుకు భార్యకు ఏకే 47 తుపాకీ గిఫ్ట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గన్స్ గిఫ్టులుగా ఇచ్చుకోవడం ఏంటి.. మీరు ఏమైనా తాలిబన్లా అంటూ మండిపడుతున్నారు. బీజేపీ, వామ పక్షాల నేతలు టీఎంసీపై, టీఎంసీ మాజీ నేత రైజల్ హాక్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేక రైజల్ హాక్ ఆ ఫోటోను డిలీట్ చేశారు. అయితే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి.. ఫోటోలు వైరల్‌గా మారాయి. సైన్యం, పారామిలిటరీ ఆపరేషన్లలో మాత్రమే ఉపయోగించే ఏకే 47 తుపాకీ.. టీఎంసీ మాజీ నేత చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నలు వెల్లువెత్తిన నేపథ్యంలో సదరు నేత స్పందించారు.
అయితే అది నిజమైన తుపాకీ కాదని.. తన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాన్ని రైజల్ హాక్ చేశారు. అది కేవలం బొమ్మ తుపాకీ అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను గానీ, తన భార్య గానీ ఎలాంటి తప్పు చేయలేదని.. తన భార్య పట్టుకుంది కేవలం ఓ బొమ్మ డమ్మీ తుపాకీ మాత్రమేనని పేర్కొన్నారు. ఆ ఫోటోను తానే సోషల్ మీడియాలో ఉంచానని.. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని తెలిపారు. చాలా మంది తనను ఆ ఫోటో గురించి అడగడం వల్లే వివాదం వద్దని దాన్ని డిలీట్ చేసినట్లు రైజల్ హక్ వెల్లడించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్‌కి అధ్యక్షుడిగా ఉన్న రైజల్ హాక్ 2 నెలల క్రితమై ఆ పదవికి రాజీనామా చేశారు.
దీనిపై బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. ఈ ఘటనపై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఇలా పబ్లిక్‌గా తుపాకీ పట్టుకుని ఫోటోలు దిగడం, తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అది బొమ్మ తుపాకీ అని రైజల్ హాక్ ఇచ్చిన వివరణ పట్ల ఆ పార్టీలు సంతృప్తి చెందడం లేదు. రైజల్ హాక్‌కు ఆ ఏకే 47 గన్ ఎక్కడి నుంచి వచ్చింది. రైజల్ హాక్ టీఎమ్‌సీ మాజీ నేత అని.. డిప్యుటీ స్పీకర్‌కి చాలా సన్నిహితుడు అని.. బీజేపీ నేత దుర్బో సహా ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఈ పోస్ట్‌లతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాలిబన్ పాలనను గుర్తుకు తెస్తున్నారా.. యువతను జిహాదీలుగా మారాలని సందేశమిస్తున్నారా అని మండిపడ్డారు.