ఏపీకి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఈ మూడు నుంచి నాలుగు రోజుల పాటూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ 1,2,3,4న రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ.. అలాగే ఏలూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మరోవైపు ఏపీలో గురువారం ఎండ మండిపోయింది. రుతుపవన గాలులు బలహీనం కావడంతో అనేక ప్రాంతాల్లో ఎండ వేసవి కాలాన్ని తలపించింది. మధ్యాహ్నం అనేక ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. ఒంగోలు, కర్నూలుల్లో 38 డిగ్రీల గరిష్ఠ ఉషోగ్రత నమోదైంది.
అలాగే సెప్టెంబర్ 4 వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో రెండు మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 54% తక్కువ వానలు పడ్డాయి. 15 జిల్లాల్లో సాధారణం కంటే 50% నుంచి 84% వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. మరో 7 జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువగానే వానలు కురిశాయి. 11 జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు నెలకొంది. 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా మండలాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. అలాగే ఆగస్టు నెల మొత్తం ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోయారు. అక్కడక్కడా వర్షాలు పడినా అది ఒకటి, రెండు రోజులకే పరిమితం అయ్యింది. మొత్తానికి ఆగస్టు నెల మొత్తం ఎండలు మండిపోతే.. సెప్టెంబర్ నెలలో మాత్రం వర్షాలు ఖాయం అంటున్నారు.