ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్,,,,విశాఖ నుంచి కృష్ణా జిల్లాకు తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2023, 07:43 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అయ్యన్నను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ చేరుకున్నారు.. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు. అయితే మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకు 41 A నోటీసులు ఇచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్ గేట్ వద్ద వదిలేసినట్లు తెలుస్తోంది. ఇటీవల గన్నవరం యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులను దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు అయ్యన్నపై ఫిర్యాదు చేయడంతో ఇటీవల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


ఈ అరెస్ట్‌పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను అధినేత చంద్రబాబు ఖండించారు. కక్షసాధించేందుకు ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎంత కక్షతో రగిలిపోతున్నారో అయ్యన్న పాత్రుడి అరెస్టే నిదర్శనం అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అయ్యన్న అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ పాలనలో ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. గన్నవరం సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని.. 60 మందిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఏం చేసినా చూస్తూ ఉండాలా.. జగన్‌కు పాలన చేతకాక టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ లు చేయించి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.


ప్రతిరోజూ చంద్రబాబు, లోకేష్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నా.. వారిపై ఒక్క చర్యా లేదన్నారు. తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అన్నారు. జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారిందన్నారు. ఎంత సేపూ ప్రశ్నించే వారిని వేధించడం , అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఏం చేసినా ప్రతిపక్షం నోరెత్తకుండా చేతులు కట్టుకొని ఉండాలా? అని ప్రశ్నించారు. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. వైఎస్సార్‌సీపీ అరాచక పాలనపై పోరాటం ఆగదన్నారు. ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని.. అయ్యన్నపాత్రుణ్ణి వెంటనే విడుదల చేయాలన్నారు.


గత నెలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.. అయితే ఈ సభలో ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


ఈ సభలో అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న ముఖ్యమంత్రిని సైకో, ధన పిశాచి, ఆర్ధిక ఉగ్రవాది, పనికిమాలినవాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి రోజాపైనా అయ్యన్న కామెంట్స్ చేశారు. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందని వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.


అయ్యన్న పాత్రుపై 153a, 354A1(4), 509, 505(2),504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటు బుద్దా వెంకన్నపై 153, 153a, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయ్యింది. గన్నవరం యువగళం బహిరంగ సభ వేదిక నుంచీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారనేది ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com