ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌న్యూస్. రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తితో ఇప్పటికే ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వడ్డీ తగ్గించిన సంగతి తెలిసిందే తాజాగా కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది. పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలపగా.. ఆ ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్‌కు అందజేశారు.
బుధవారం సెర్ప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెర్ప్ బ్యాంకు లింకేజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.కేశవకుమార్, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ ఐ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే ఎస్‌బీఐ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీని 12.15 శాతానికి బదులు 9.70 శాతం చేసింది. అలాగే కెనారా బ్యాంకు కూడా ‘ఏ’ కేటగిరీలో ఉండే పొదుపు సంఘాలకు రూ. 5 లక్షల పైబడి రుణాలపై 9.70 శాతం వడ్డీనే వసూలు చేస్తామని తెలిపింది. అంతేకాదు రుణాలపై ఎలాంటి అదనపు, ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యువల్ ఛార్జీలను పూర్తిగా మినహాయించింది.
అంతేకాదు ఏపీలో పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకుల ప్రాసెసింగ్ ఛార్జీలపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసింది. బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా చూడాలని కోరింది. పొదుపు సంఘాల్లో రుణాలు తీసుకునే మహిళల్లో ఎక్కువమంది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయని గుర్తు చేశారు.. అందుకే ఈ ప్రాసెసింగ్ ఛార్జీలు భారంగా మారిందని ప్రస్తావిస్తోంది ప్రభుత్వం. అంతేకాదు సీఎం జగన్ కూడా బ్యాంకర్లను ప్రాసెసింగ్ ఫీజుపై రిక్వెస్ట్ చేయగా.. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం డ్వాక్రా మహిళలకు శుభవార్త అనే చెప్పాలి.
ఇటీవలే డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బుల్ని కూడా ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 1.05 కోట్ల మంది మహిళలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. ఈ నెల 11న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఆ మొత్తాన్ని మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు రూ.4,969.05 కోట్లు జమ చేసింది.