పొరుగు దేశం పాకిస్థాన్‌లో రోజు రోజుకూ పరిస్థితులు తీవ్ర అధ్వాన్నంగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఓ వైపు.. రాజకీయంగా తీవ్ర అస్థిరత చోటు చేసుకున్న వేళ.. ద్రవ్యోల్బణం కూడా రికార్డు స్థాయికి చేరుకుంటోంది. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ ధరలు పాక్ వాసులకు మంట పుట్టిస్తున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఎన్నడూ లేనంతగా ఎగబాకింది. పాకిస్థాన్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 300 దాటింది. దీంతో పాకిస్థానీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆకాశన్నంటుతున్న ధరలతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా చమురు ధరలు పెరగడంతో ఆ భారం మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఛిన్నాభిన్నం అవుతున్న పాక్ వాసులపై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల రూపంలో వారిపై మరో పిడుగు పడింది. పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 దాటడంతో వారు కొనలేని పరిస్థితి నెలకొంది. పాక్ దేశ చరిత్రలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ చమురు ధరలను పెంచుతూ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజాగా లీటర్ పెట్రోల్ ధరను రూ.14.91 పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.305.36 కు ఎగ బాకింది. ఇక హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్‌కు రూ.311.84 కు పెంచడంతో రూ.311.84 కు చేరుకుంది. మరోవైపు.. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకం విలువ కూడా భారీగా పతనం అయింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ రూ.305.6 గా ఉంది. పాక్ కరెన్సీ విలువ భారీగా పతనం కావడంతో పాక్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిర్ణయం.. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న పాక్ వాసులను మరింత కుంగదీస్తోంది.
మరోవైపు.. భారీగా విద్యుత్ ఛార్జీల ధరలపై ఇటీవల పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం మోయలేక పాక్ వాసులు ఇటీవల పలు చోట్ల ఆందోళనలకు దిగారు. తమకు వచ్చిన భారీ కరెంటు బిల్లుల్ని కాల్చివేశారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులతో తీవ్ర ఘర్షణకు దిగారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే రుణాలపైనే పాకిస్థాన్ ఆధారపడుతోంది.