ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 వ తేదీల్లో ప్రతిష్ఠాత్మకమైన జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశాలకు జీ 20 దేశాల అధినేతలతో పాటు ఇతర దేశాల అగ్ర నేతలు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జీ 20 సదస్సు కోసం అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఢిల్లీ నగరంలో కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ నగరం మొత్తాన్ని సీసీటీవీ నిఘాలో బంధించారు. అయితే ఈ జీ 20 సదస్సు ఏర్పాట్లలో భాగంగా అధికారులు కొండ ముచ్చులను రంగంలోకి దింపారు. అయితే కొండ ముచ్చులు అంటే నిజమైనవి కాకుండా వాటి కటౌట్లను ఏర్పాటు చేశారు.
అయితే ఢిల్లీలో కోతుల బెడద అధికంగా ఉంది. ఆ కోతులను అదుపు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ఈ కోతుల బెడదను అధిగమించేందుకు అన్ని రకాల చర్యలను అధికారులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సంప్రదాయ పరిష్కార మార్గంగా కొండముచ్చుల లాంటి కటౌట్‌లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు కొండ ముచ్చుల్లాగా శబ్దాలు చేసేందుకు ప్రత్యేకంగా కొందరు శిక్షణ కలిగిన సిబ్బందిని కూడా నియమించుకుంటున్నారు.
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని కాంప్లెక్స్‌లో జీ 20 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీని కోసం ఢిల్లీలోని అన్ని ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. అందమైన ఫౌంటెయిన్లు, పూల మొక్కలతో పర్యాటక ప్రదేశాలు, కూడళ్లను తీర్చిదిద్దుతోంది. అయితే ఇటీవల ఢిల్లీలోని పలు పర్యాటక ప్రదేశాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరగడం.. పర్యాటకులపై దాడులు కూడా చేస్తుండటంతో అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారింది. దీంతో జీ 20 సదస్సుకు వచ్చే విదేశీ అతిథులు, పర్యాటకులకు.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే జీ 20 సమావేశాలు జరిగే వేదికలు, అతిథులు బస చేసే హోటళ్లతోపాటు అనేక కీలక చౌరస్తాలలో భారీ సైజు కొండముచ్చుల కటౌట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వాటి లాగానే శబ్దాలు చేసేందుకు దాదాపు 40 మంది శిక్షణ పొందిన సిబ్బందిని కూడా ఆయా ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఈ కొండ ముచ్చుల కటౌట్లు, సిబ్బంది చేసే శబ్ధాలతో కోతులు భయపడి పారిపోతాయని భావిస్తున్నారు. నగరంలోకి కోతులు రాకుండా ఉండేందుకు అవి ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు ఉంచుతున్నారు. అతిథుల కాన్వాయ్‌లకు అడ్డురాకుండా ఉండటం, కూడళ్లలో ఏర్పాటు చేసిన మొక్కలు, పూలను కోతులు పాడుచేయకుండా.. అటవీశాఖ అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.