తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన టీటీడీ నూతన పాలక మండలి మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సమావేశమయ్యింది. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
అంతేకాదు, 25 ఏళ్లలోపు వాళ్లు గోవిందా కోటిని రాస్తే.. వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ముంబాయి బంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, 29 స్పెషలిస్ట్, 15 వైద్యులతో పాటు చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగుల నియామకాలకు అమోదం తెలిపినట్టు వివరించారు.
వీటితో పాటు రూ.2.16 కోట్లతో టీటీడీ ఆస్పత్రుల్లో మెడిసిన్ కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలక మండలి సమావేశంలో ఆమోదం లభించినట్టు టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఇక, స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26 వరకూ జరగనున్నాయిన తెలిపారు. అలాగే, అధిక మాసం కావడం వల్ల అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు18 ధ్వజరోహణం సందర్భంగా ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అదే రోజు టీటీడీ క్యాలండరలు, డైరీలను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవనవిధానం అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి.. కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉందని కరుణాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఇక రూ.2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం, రూ. 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనులకు నిధులు కేటాయింపు.. పోటులో పెండింగ్‌లో ఉన్న 413 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయీంచినట్టు చెప్పారు. తిరుపతిలోని టిటిడి ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ది పనులుకు 4.15 కోట్ల రూపాయలు కేటాయించాంమన్నారు..