సెప్టెంబర్ నెల వచ్చి 5 రోజులు గడుస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు ఇంకా జీతాలు రాలేదు. దీనిపై కొంత మంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు టీచర్స్ డే జరుపుకొంటుంటే.. టీచర్లకు మాత్రం వేతనాలు రాలేదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జీతాలు ఆలస్యం కావడానికి కారణమేంటో వివరించారు. సాంకేతిక కారణాల వల్లే జీతాలు ఆలస్యం అయ్యాయని.. 7 లేదా 8వ తేదీల్లో ఉపాధ్యాయుల బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని మంత్రి బొత్స తెలిపారు.
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు అందించారు. ఆయనతో పాటు మంత్రి గుడివాడ అమర్‌నాథ్, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఆయన వెల్లడించారు. ‘రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ఎన్నో ఏళ్లుగా నియామకాలు లేవు. దీనిపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం నియామకాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు’ అని ఆయన అన్నారు.
‘ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నేడు ప్రభుత్వ పాఠశాల ముందు నో సీట్ బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను ప్రశంసించారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.